Summer Effect in Telangana: తెలంగాణలో భానుడు భగభగ మండిపోతున్నాడు. భానుడి సెగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలు దాటిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఓ వైపు ఉక్కపోత మరో వేడిగాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పలు జిల్లాల్లో అయితే ఏకంగా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. మరో వైపు ఎండల తీవ్రత దృష్ట్యా పలు జిల్లాల్లో యెల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతల నేపథ్యంలో మధ్యాహ్నం వేళల్లో అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. రాత్రి పొద్దుపోయాకా కూడా చల్లబడడం లేదు. ఫలితంగా ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Read Also: Congress: కాసేపట్లో తుక్కుగూడలో కాంగ్రెస్ ‘జనజాతర’ సభ
రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడ్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో, నల్గొండ జిల్లాలోని నాంపల్లిలో 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్, ములుగు జిల్లాలోని మేడారం, కుమురంభీం జిల్లాలోని పెంచికల్ పేట, మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ, భద్రాద్రి జిల్లా అశ్వాపురం, దమ్మపేటలో 44,4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వేడిగాలులు వీస్తుండడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు.
ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యమైన పనులుంటే ఉదయం, సాయంత్రం వేళల్లో చూసుకోవాలని చెబుతున్నారు. మధ్యాహ్నం వేళలో బయటకు వస్తే మంచి నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగాలని సూచించారు. డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా తరుచూ మంచి నీరు తాగాలని కోరారు.
