కేవలం విద్య మాత్రమే సమాజాన్ని , దేశాన్ని మారుస్తుంది రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్య ప్రమాణాలతో మెరుగుపడాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా విద్యార్థులు రాణించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న వనిత మహావిద్యాలయా ఫార్మసీ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయి మాట్లాడారు. నాణ్యమైన విద్య తో పాటు మహిళ సాధికారతను అందించడంలో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ కృషి అభినందనీయం అన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన మంత్రి.. విద్యార్థులకు, సంస్థకు ప్రభుత్వం నుండి అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు.
ఇదిలా ఉంటే.. 12 ఏండ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్ష తామే నిర్వహించామని, త్వరలో జాబ్ క్యాలెండర్‌నూ రిలీజ్ చేస్తామని శ్రీధర్ బాబు ప్రకటించారు. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీశ్‌రావుకు లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆశా వర్కర్లను గుర్రాలతో తొక్కించారని మంత్రి గుర్తు చేశారు. పెద్దపల్లిలో అత్యాచార ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందని శ్రీధర్ బాబు వెల్లడించారు. మత ఘర్షణల విషయంలో సీరియస్‌గా ఉన్నామని చెప్పారు. వీటి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు.