Story Board: బంగారం ప్రపంచానికి పెట్టుబడి సాధనం కావచ్చు. కానీ భారత్ లో బంగారం అంటే సెంటిమెంట్. ముఖ్యంగా మహిళలకు పసిడితో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ధరలతో సంబంధం లేకుండా ఇండియాలో ఎప్పుడూ గోల్డ్ కు డిమాండ్ తగ్గదు. కరోనా టైమ్ లో కూడా మన దగ్గర బంగారం కొనుగోళ్లు బాగానే జరిగాయి. సామాన్యులతో పాటు ఆర్బీఐ కూడా పసిడి నిల్వలపై దృష్టి పెడుతూ ఉంటుంది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకున్న నమ్మకమైన పెట్టుబడి సాధనంగా బంగారానికి పేరుంది. ఈ విషయం గతంలో ప్రూవ్ అయింది కూడా. అందుకే మన దేశంలో ప్రజలతో పాటు ప్రభుత్వం, ఆర్బీఐ కూడా ఎప్పటికప్పుడు బంగారం నిల్వలు తగ్గకుండా చూసుకుంటాయి. ఇప్పుడు గత పది రోజులుగా బంగారం ధరలు తగ్గాయి. ఏడు నెలల కనిష్టానికి చేరింది. కొన్ని నెలల క్రితం ఓ దశలో బంగారం ఆల్ టైం హైకి చేరి భయపెట్టింది. అలాంటిది సరిగ్గా పండగల సీజన్ ముందు ఎందుకు తగ్గుతోందనే ప్రశ్నలు వస్తున్నాయి.
సాధారణంగా డిమాండ్ ఎక్కువగా ఉండి.. సప్లై తక్కువగా ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. అదే డిమాండ్ తక్కువగా ఉండి.. సప్లై పెరిగినప్పుడు రేట్లు తగ్గుతాయి. ప్రపంచం సంగతేమో కానీ.. మన దగ్గర బంగారానికి డిమాండ్ తగ్గడం అంటూ ఉండదు. పైగా త్వరలో పండగ సీజన్ ప్రారంభమవుతోంది. ఈ సీజన్ ఫుజ్ గా బిజినెస్ జరిగే సీజన్ అని బంగారం షాపులు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సాధారణంగా గోల్డ్ రేట్ తగ్గదు. కానీ ఈసారి అనూహ్యంగా వరుసగా పది రోజులు ధరలు తగ్గాయి. అదీ ఏడు నెలల కనిష్టానికి పసిడి చేరుకుంది. దీంతో పసిడి ప్రియులకు ఒక్కసారిగా హుషారొచ్చింది. పండగ కొనుగోళ్లకు ఇదే మంచి సమయమని భావిస్తున్నారు. కానీ ధర తగ్గిందేంటి అనే అనుమానం వారిని పట్టి పీడుస్తోంది. కొంపతీసి ఇంకా తగ్గితే నష్టపోతామేమో అనే భయం వెంటాడుతోంది. అందుకే ఎక్కువ బంగారం కాకుండా.. పరిమిత కొనుగోళ్లతో సరిపెట్టుకోవాలా అని కూడా ఆలోచిస్తున్నారు. అయితే ధరల్లో హెచ్చుతగ్గులపై నిపుణుల విశ్లేషణ మరోలా ఉంది.
బంగారం ధర తగ్గగానే.. డిమాండ్ తగ్గిందేమో అనే ఆలోచన రావటం సహజం. కానీ ఈసారి అలా జరగలేదు. అసలు లోకల్ డిమాండ్ తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే రాబోయోది పండగ సీజన్. దసరా నుంచి దీవాళీ వరకు అన్ని వ్యాపారాలూ ఫుల్ జోష్ లో ఉంటాయి. ఇక బంగారం గురించి చెప్పక్కర్లేదు. అలాంటిది ఈసారి డిమాండ్ లేదా ఏంటి అని సామాన్యులు చర్చించుకున్నారు. కానీ బంగారం ధరలు లోకల్ గా డిమాండ్ లేక తగ్గలేదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులే దీనికి కారణం అంటున్నారు.
సాధారణంగా డాలర్ విలువ, బంగారం ధర రెండూ ఆపోజిట్ గా ఉంటాయి. ఒకటి తగ్గితే మరోటి పెరుగుతుంది. ఒకటి పెరిగితే మరోటి తగ్గుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. యూఎస్ డాలర్ విలువ పెరగడం.. బంగారానికి చెక్ పెట్టింది. దీనికి తోడు యూఎస్ ప్రభుత్వ బాండ్లపై రాబడి పెరగటం కూడా మదుపర్లను అటువైపు ఆకర్షించింది. ఇటు యూఎస్ ఫెడ్ రిజర్వ్ కూడా కీలక వడ్డీరేట్లు పెంచుతుందన్న సంకేతాలు కూడా బంగారం కొంప ముంచాయి. దీంతో పాటు అమెరికాలో ఉద్యోగాల కల్పన పెరుగుతున్న సంకేతాలు కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణమయ్యాయి. బంగారం రిటైల్ కొనుగోళ్ల కంటే.. పెట్టుబడి లక్ష్యంతో జరిగే హోల్ సేల్ కొనుగోళ్లే ధరని, డిమాండ్ ను ప్రభావితం చేస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు రకరకాల పెట్టుబడి మార్గాలుంటాయి. కొందరు డాలర్ మీద పెట్టుబడి పెడతారు. మరికొందరు బంగారం మీద పెడతారు. కొందరు క్రూడ్ ఆయిల్ మీద కూడా పెడతారు. కానీ మెజార్టీ పెట్టుబడిదారుల ఎంపిక మాత్రం డాలర్, బంగారమే అనడంలో సందేహం లేదు. సింపుల్ గా చెప్పాలంటే.. అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుంటే.. బంగారం ధర తగ్గుతుంది. అమెరికాలో ఏ సమస్య వచ్చినా.. బంగారం ధర పెరుగుతుంది. కోవిడ్ టైమ్ లో డాలర్ విలువ పడిపోవడంతో.. బంగారానికి రెక్కలొచ్చాయి. ఆ తర్వాత కూడా చాన్నాళ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థలో కదలిక లేదు. దీంతో బంగారం పెరుగుతూనే పోయింది. కానీ ఇప్పుడిప్పుడే అమెరికా ఆర్థిక గణాంకాలు మెరుగవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా వరుసగా పెరుగుతున్న అమెరికా డాలర్ విలువ, అమెరికా ప్రభుత్వ బాండ్లపై రాబడి.. మదుపర్లను అటు మళ్లేలా చేశాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు తగ్గిపోయాయి. అలా అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోయింది. అందుకే రేటు తగ్గింది. దీనికీ మన కొనుగోళ్లకూ సంబంధం లేదు కాబట్టి.. వినియోగదారులు ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదంటున్నారు నిపుణులు. అయితే ఎప్పుడైనా పుత్తడి కొనేటప్పుడు కొద్దిరోజుల పాటు ధరల్లో హెచ్చుతగ్గుల్ని గమనించి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
గత 10 రోజులుగా బంగారం విలువ కోల్పోతూ వస్తుంది. డాలర్ విలువ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో విఫలమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏకంగా 7 నెలల కనిష్టానికి పడిపోయింది. భౌతికంగా కొనాలనుకునేవారికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. అయితే ఇన్వెస్టర్లకు మాత్రం బంగారం ధర పడిపోతున్న కొద్దీ నష్టాలు వస్తుంటాయి. కొద్దిరోజుల కింద ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1900 డాలర్లపైన ట్రేడవగా.. ఇప్పుడు 1840 డాలర్ల లెవెల్స్‌కు చేరింది. డాలర్ పెరుగుతున్న తరుణంలోనే బంగారం ధర ఒత్తిడికి గురవుతోంది. రానున్న రోజుల్లో ఇది ఇంకా పడిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది అమెరికా పాక్షిక షట్ డౌన్ అవుతుందా.. లేదా అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. డాలర్ వరుస ర్యాలీ చేస్తోంది. ఏకంగా 10 నెలల గరిష్టానికి ఈ సూచీ చేరింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మళ్లీ పెంచుతుందన్న అనుమానాలే దీనికి కారణం. దీంతో డాలర్ పెరిగి.. ట్రెజరీ ఈల్డ్స్ పుంజుకొని.. బంగారాన్ని కిందికి పడేస్తుంది. అయితే ప్రస్తుతానికి బంగారం ధర పడుతున్నా.. రానున్న రోజుల్లో మళ్లీ తిరిగి పుంజుకుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి కొద్దిరోజులు వేచిచూడటం ఉత్తమమని చెబుతున్నారు.
పెళ్లిళ్లు, పండగల సీజన్‌కు ముందు గోల్డ్ రేటు భారీగా పతనం అవుతోంది. ఇదే గోల్డెన్ ఛాన్స్ చెప్పొచ్చు. ఇటీవల కొన్ని నెలలుగా ఇలాంటి పతనం చూసుండరు. వరుసగా 10 రోజులుగా పసిడి రేటు పడుతూనే ఉంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల్లో భారీగా దిగొచ్చింది కూడా. 10 రోజుల వ్యవధిలో దాదాపు రూ. 3000 వరకు పసిడి ధర తగ్గిందని చెప్పొచ్చు. 10 రోజుల్లో పతనం ఎంతో చూస్తే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర సెప్టెంబర్ 25 న 10 గ్రాములకు రూ. 59,950 వద్ద ఉండగా.. ఇప్పుడు రూ.57,160 వద్ద ఉంది. అంటే ఇక్కడ ఏకంగా రూ.2790 తగ్గింది. ఈ మధ్య కాలంలో 10 రోజుల్లో ఇంత ఎప్పుడూ తగ్గలేదు. ఇక 22 క్యారెట్ల పుత్తడి చూస్తే 10 రోజుల వ్యవధిలో ఏకంగా 2550 తగ్గుదల కనిపించింది. గోల్డ్ రేటు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర మే 5న అత్యధికంగా రూ. 62,400 వద్ద ఉండేది. ఇప్పుడు రూ. 57,160 వద్ద ఉంది. అంటే ఈ సమయంలో రూ. 5240 తగ్గింది. అంటే దాదాపు 4 నెలల కాలంలోనే గోల్డ్ రేటు ఏకంగా రూ. 5 వేలకుపైగా పడిపోయింది. తులంపై ఇంత తక్కువ కాలంలో రూ. 5 వేలు తగ్గిందంటే మామూలు విషయం కాదు.
బంగారం ధరలతో పాటే వెండి ధరలు కూడా హైదరాబాద్‌లో భారీగా తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ 25న కేజీ సిల్వర్ రేటు రూ. 79 వేల వద్ద ఉండగా.. ఇప్పుడు రూ. 73,500 వద్ద ఉంది. తాజాగా రూ. 400 పెరిగింది. అంతకుముందు 10 రోజుల్లో 9 రోజులు పతనమైంది. ప్రస్తుతం బంగారం ధర పడిపోయేందుకు కారణం ఒకటే. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరోసారి పెంచనుందన్న సంకేతాల నడుమ యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ రికార్డు గరిష్టాలకు చేరుతున్నాయి. డాలర్ ఇప్పటికే 11 నెలల గరిష్టం వద్ద ఉంది. ఈ క్రమంలోనే పెట్టుబడిదారులు వీటిపై నమ్మకం చూపిస్తున్నారు. ఇదే క్రమంలో బంగారం విలువ కోల్పోతుంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే ధర మరింత పడిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ మళ్లీ బంగారంలో బుల్లిష్ ట్రెండ్ మొదలైనట్టు కనిపిస్తోంది. అందుకే తొందరపడి అంచనాకు రాలేమంటున్నారు నిపుణులు.