Site icon NTV Telugu

Telangana: తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Telangana Govt

Telangana Govt

Telangana: తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రేవంత్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రీప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి ఈ కమిషన్‌ ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిషన్‌లో ఒక ఛైర్మన్, ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులను ప్రభుత్వం త్వరలోనే నియమించనుంది. ఛైర్మన్, సభ్యులు రెండేళ్లపాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులతోపాటు.. అంగ‌న్‌వాడీ, ప్రాథ‌మిక పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వ విద్యాల‌యాల వ‌ర‌కు నాణ్యమైన విద్య బోధ‌న‌, నైపుణ్య శిక్షణ‌, ఉపాధి క‌ల్పన‌కు త‌మ ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో వెల్లడిచారు. దీనిలో భాగంగానే విద్యాకమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.

Read Also: Municipality: ఓఆర్‌ఆర్‌ పరిధిలోని గ్రామాలు సమీప మున్సిపాలిటీలలో విలీనం.. గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ విద్యా కమిషన్ లక్ష్యాలు:
*మారుతున్న/డైనమిక్ ఎడ్యుకేషనల్ ల్యాండ్‌స్కేప్‌ను పరిగణనలోకి తీసుకుని విద్యారంగంలో విధాన రూపకల్పనపై తెలంగాణ ప్రభుత్వానికి సలహా ఇవ్వడం, థింక్ ట్యాంక్‌గా పనిచేయడం. పైలట్ అధ్యయనాలు చేయడం, పాలసీ నోట్‌లను అభివృద్ధి చేయడం, సంప్రదింపులు చేయడం, మార్గదర్శకాలు, నియమాలు, సులభతరం చేయడం లాంటి అంశాలపై అధ్యయనం చేసి కమిషన్‌ సిఫార్సు చేయనుంది.

*నాణ్యమైన ఉన్నత విద్య, ఉన్నత విద్యా సంస్థలతో అప్రెంటిస్‌షిప్/ ఉపాధి నైపుణ్యాలను ఏకీకృతం చేయడం, పాఠశాలల్లో నాణ్యమైన విద్య విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై దృష్టి , ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు పునాది నైపుణ్యాలు వంటి అంశాలపై పరిశీలన చేయనుంది.

*విద్యార్థులను మంచి, బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరులుగా తయారు చేసేందుకు కావాల్సిన విద్యపై సిఫార్సులు చేయడం వంటి అంశాలపై దృష్టి సారించనుంది.

Exit mobile version