జార్ఖండ్‌లోని దుమ్కాలో స్పానిష్ మహిళా టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం ఉదంతం మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 21 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందినదిగా గుర్తించారు. పాలములోని విశ్రంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. అయితే.. ఆమే స్టేజ్ ప్రదర్శన ఇవ్వడం కోసమని జార్ఖండ్‌కు వెళ్లింది. కాగా.. బాధితురాలి సహోద్యోగులే అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించింది. ఈ ఘటన సోమవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో.. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం బాధితురాలు జార్ఖండ్‌లోని విశ్రాంపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో స్టేజ్ షోలో పాల్గొనడానికి తన సహచరులతో కలిసి చత్తీస్‌గఢ్ నుండి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఆర్కెస్ట్రాలో పనిచేసేదని గుర్తించారు. కొన్ని కారణాల వల్ల అక్కడ కార్యక్రమం నిర్వహించలేక పోవడంతో.. ఆ అమ్మాయి తన స్నేహితులతో కలిసి అదే కారులో మరో కార్యక్రమానికి బయలుదేరింది. దారిలో వెళ్తుండగా.. బాధితురాలికి మత్తు మందు ఇవ్వడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయిందని తెలిపారు.
ఆ తర్వాత.. బాధితురాలిపై తోటి కళాకారులు ముగ్గురు కదులుతున్న కారులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన వదిలి వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. స్పృహలోకి వచ్చిన తరువాత.. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరొకరి పోలీసులు గాలిస్తున్నారు. .
మరోవైపు.. ఈ ఘటన దురదృష్టకరమని బీజేపీ ఎంపీ గీతా కోరా తెలిపారు. అంతేకాకుండా.. అటు సీఎం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో పెరుగుతున్న అత్యాచార ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు.
