Duddilla Sridhar Babu : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే BRS పార్టీ నిరంతరం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ పథకాలు, పారదర్శకంగా నడుస్తున్న కార్యక్రమాలపై తప్పుడు ప్రచారానికి దిగడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం BRS పార్టీకి అలవాటైందని ఆయన అన్నారు. మంత్రి మాట్లాడుతూ, ఇటీవల ప్రైవేట్ వ్యక్తుల పేరిట జరుగుతున్న వ్యవహారంపై సీఎం స్వయంగా సుప్రీంకోర్టులో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. “కోర్టు తీర్పు స్పష్టం చేసింది – అది ప్రభుత్వ భూమి అని తేల్చింది,” అని శ్రీధర్ బాబు అన్నారు. అయినప్పటికీ BRS పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తూ, AI టూల్స్ ద్వారా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.
BRS పార్టీ సోషల్ మీడియాను అసత్య ప్రచారానికి వేదికగా మార్చిందని విమర్శించిన మంత్రి, “చట్టాన్ని అతిక్రమిస్తే, ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. కానీ, చీప్ పాలిటిక్స్ చేసి ప్రజలను మోసగించడం అవసరమా?” అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై బురద జల్లే పనిలో BRS నిమగ్నమైందని మండిపడ్డారు. భూముల విలువపై KTR చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన శ్రీధర్ బాబు, “5200 కోట్ల విలువ గల భూమిని 30 వేల కోట్లుగా చూపించారన్నది అసత్యం. TGIIC, CBRE ప్రకారం భూమి విలువను నిర్ధారించాం. RBI, SEBI నిబంధనల మేరకు బాండ్ల రూపకల్పన జరిగింది. తక్కువ వడ్డీతో నిధులు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం,” అని స్పష్టం చేశారు.
డిసెంబర్ 5న రూ. 9995 కోట్ల బాండ్ బిడ్డింగ్ జరిగినట్టు తెలిపారు. “ఆ అప్పుతో మేము రైతులకు మేలు చేశాం. రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల్లో నిధులు వినియోగించాం. రైతుల కోసం తీసిన అప్పు వేసుకోద్దా?” అని ఎదురుదాడికి దిగారు. మూసీ నదీ పునరుజ్జీవన పథకం విషయంలో కూడా BRS పార్టీ తప్పుడు భావజాలంతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందని విమర్శించారు. “మూసీ పునరుద్ధరణ కోసం పర్యావరణం అవసరం లేదని అడ్డుపడుతున్నారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వినియోగించాలంటే పర్యావరణం పేరుతో ఆందోళనలు చేస్తున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటి? అభివృద్ధికి వ్యతిరేకమా?” అని ప్రశ్నించారు.
UK YouTuber: బ్రిటీష్.. భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. యూకే యూట్యూబర్ ఎందుకు ఇలా అన్నాడు?