SRH vs MI: హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. వరుసపెట్టి ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. కేవల 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఎస్‌ఆర్‌హెచ్ జట్టు. ఉప్పల్ స్టేడియంలో భారీగా పరుగుల వరద పారుతుందని భావించిన అభిమానులకు మాత్రం పూర్తి నిరాశ ఎదురయింది.
ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ ఓ అవసరంలేని రికార్డును తన పేరున రాసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో అతి తక్కువ పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. పవర్ ప్లే ముగిసిన సమయానికి సన్ రైజర్స్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 24 పరుగులు మాత్రమే చేసింది. ఇక 9 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 37 పరుగులను సాధించింది. ఇందులో దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ చేరో రెండు వికెట్లు తీసుకోగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన వంతుగా ఒక వికెట్ ను తీశాడు.