Spice Jet: స్పైస్‌జెట్ సంస్థ పైలట్లకు శుభవార్త తెలిపింది. స్పైస్‌జెట్ 18వ వార్షికోత్సవం సందర్భంగా పైలట్‌ల జీతాలను నెలకు రూ.7.5 లక్షలకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. సంస్థ 18వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ పైలట్ల వేతన పెంపును ఈ నెల 16 నుంచి వర్తిస్తుందని వెల్లడించింది. స్పైస్‌జెట్ భారతదేశంలోని 48 గమ్యస్థానాలకు, విదేశాలకు రోజువారీ 250 విమానాలను నడుపుతోంది. పైలట్లతోపాటు ట్రైనర్లు (డీఈ, టీఆర్‌ఐ), ఫస్ట్ ఆఫీసర్ల జీతాలను కూడా అనుగుణంగా పెంచారు.
అంతకుముందు నవంబర్ నెలలో ఎయిర్‌లైన్ పైలట్‌ల వేతనాలను సవరించింది. కెప్టెన్ల జీతం 80 గంటల విమానం నడపడానికి నెలకు రూ. 7 లక్షలకు పెంచారు. మిగిలిన ఉద్యోగుల జీతాలు సైతం నిబంధనలకు అనుగుణంగా పెరిగాయి. తాజా పెంపు నిర్ణయంతో పాటు కెప్టెన్‌లకు నెలకు రూ. లక్షల నెలవారీ రాయల్టీ రివార్డ్‌ను కంపెనీ ప్రకటించింది. ఇది ఆయా ఉద్యోగుల నెలవారీ వేతనం కంటే ఎక్కువగా ఉంటుంది. అత్యున్నత ప్రమాణాల సేవలను నిర్వహించడానికి ఉద్యోగులు కట్టుబడి ఉండాలని స్పైస్‌జెట్ ఛైర్మన్ అజయ్ సింగ్ కోరారు.
Read Also: New Parliament Building: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన సీపీఐ(ఎం)
ఉద్యోగుల జీతాల పెంపుతో పాటు స్పైస్‌జెట్ విమాన ప్రయాణీకులకు సైతం వార్షికోత్సవ ప్రత్యేక ఆఫర్లను సంస్థ ప్రకటించింది. విమాన టికెట్లను తక్కువ ధరలు అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అందులో భాగంగా బెంగళూరు-గోవా, ముంబై-గోవా మధ్య ప్రయాణానికి అతితక్కువ రూ. 1,818 ధరకే విమాన టికెట్ కొనవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు ఉంటుందని, టికెట్లను బుక్ చేసుకున్న వినియోగదారులు ఈ ఏడాది జూలై 1 నుంచి 2024, మార్చి 30 మధ్య కాలంలో ప్రయాణించవచ్చు. అలాగే, వివిధ డిస్కౌంట్ కూపన్లను కూడా వినియోగదారులకు ఇవ్వనున్నట్టు స్పైస్‌జెట్ వెల్లడించింది.