Village for Sale : మీ దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయా.. ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే మీ కోసమే ఈ బంపర్ ఆఫర్.. కాకపోతే మీ దగ్గర డబ్బులు కచ్చితంగా రెండుకోట్ల రూపాయలు ఉండాల్సిందే. వాటితో ఓ ఊరునే కొనుగోలు చేయవచ్చు. దాంతో ఒక గ్రామానికే యజమానిగా మారిపోవచ్చు. అడ్రస్ తెల్సుకోవాలని ఉందా.. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే… స్పెయిన్‌లోని సాల్టో డే కాస్ట్రో అనే గ్రామం పోర్చుగల్ సరిహద్దులో ఉంది. రాజధాని మాడ్రిడ్ నుంచి మూడు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. 1950ల్లో ఆ ప్రాంతంలో ఓ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ సమయంలో కార్మికుల కోసం విద్యుత్ ఉత్పత్తి సంస్థ నివాసాలు ఏర్పాటు చేసింది. అయితే, ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత అక్కడి వారంతా సమీప పట్టణాలకు తరలిపోయారు. ఇలా 1990నాటికి ఆ ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. అక్కడ 44 ఇండ్లు, ఓ హోటల్, చర్చి, పాఠశాల, స్విమ్మింగ్ పూల్‌తోపాటు ఇతర సదుపాయాలున్నాయి. ఇప్పుడు అదే గ్రామాన్ని ప్రస్తుతం అమ్మకానికి పెట్టారు. ధర కూడా అందుబాటులోనే ఉంది. కేవలం 2,27,000 యూరోలకే అంటే భారత కరెన్సీలో సుమారు 2కోట్ల 16లక్షల రూపాయలు మాత్రమే.
Read Also: MP comments On Pawan Kalyan: కేఏ పాల్ లాంటోడే పవన్ కల్యాణ్.. పెద్ద తేడా ఏం లేదు
అయితే, ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనుకుని 2000లో ఆ గ్రామాన్ని ఓ కుటుంబం కొనుగోలు చేసింది. కానీ కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ఆ ప్రణాళికను విజయవంతం చేయలేకపోయింది. దీంతో చివరకు ఆ గ్రామాన్ని విక్రయించాలని వారు నిర్ణయించారు. స్పెయిన్‌కి చెందిన ప్రముఖ ప్రాపర్టీ వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపరిచింది. నవంబర్ తొలివారంలో ఆ ప్రకటన పోస్టు చేయగా.. భారీ స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 50వేల మంది ఆ ప్రాపర్టీ వివరాలను చూడగా.. రష్యా, ఫ్రాన్స్, బెల్జియంతోపాటు బ్రిటన్‌కు చెందిన 300 మంది ఆ గ్రామాన్ని కొనేందుకు ముందుకు వచ్చినట్లు ఆ వెబ్ సైట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.