Kadapa: కడప గౌస్ నగర్‌లో పోలింగ్ రోజున సాయంత్రం జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు. సంబంధిత పోలీస్ అధికారులపై కఠినమైన చర్యలకు రంగం సిద్ధం చేశారు. వారికి ఛార్జ్ మెమో జారీ చేశారు జిల్లా ఎస్పీ. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కడప వన్ టౌన్ సీఐ భాస్కర్ రెడ్డి, కడప వన్ టౌన్ ఎస్సై రంగ స్వామి, తాలూకా ఎస్సై తిరుపాల్ నాయక్, చిన్నచౌక్ ఎస్సై మహమ్మద్ రఫీ, రిమ్స్ ఎస్సై యు.ఎర్రన్న, కడప టూ టౌన్ ఎస్సై మహమ్మద్ అలీ ఖాన్‌లకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.. నివేదిక వచ్చాక మరింత తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Palnadu: పల్నాడు కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేష్ బాలాజీ నియామకం.. ఈసీ ఉత్తర్వులు
పోలింగ్ రోజున గౌస్‌నగర్‌లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. గౌస్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద రెండు వర్గాలు గొడవ పడ్డాయి. పరస్పరం రాళ్లు రువ్వుకోగా.. వైసీపీ నేతకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఎవరినీ నిలువరించలేదనే విమర్శలు వ్యక్తం కాగా.. ఈ ఘటనపై శనివారం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్ష నిర్వహించారు. పోలింగ్ రోజున విధుల్లో ఉన్న అధికారులందరికీ ఛార్జి మెమోలు దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాల రోజున కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎస్పీ జిల్లా పోలీసులను ఆదేశించారు.