NTV Telugu Site icon

TDP: త్వరలోనే టీడీపీ రెండో విడత అభ్యర్థుల జాబితా!

Tdp

Tdp

TDP: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోసం తెలుగుదేశం – జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాల బరిలోకి దింపడం ద్వారా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా అనేకసార్లు ఇరుపార్టీలు అధినేతలు సమావేశమై అభ్యర్థులు ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు. త్వరలోనే రెండో విడత అభ్యర్థుల జాబితాను టీడీపీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 99 మంది అభ్యర్థులతో టీడీపీ మొదటి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోటీ చేసే కొన్ని స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే స్పష్టతకు కూటమి పార్టీలు రావాల్సి ఉంది. ఈ స్పష్టత రాగానే టీడీపీ రెండో విడత జాబితాను విడుదల చేయనుంది. పి.గన్నవరం, కైకలూరు, తాడేపల్లి గూడెం, పెందుర్తి, కాకినాడ అర్బన్, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, మదనపల్లె, కదిరి, కాళహస్తి వంటి స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

Read Also: Mudragada Padmanabham: ఈ నెల 14న వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం

సోము వీర్రాజు కోసం రాజమండ్రి అర్బన్ పై టీడీపీ పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజమండ్రి అర్బన్ స్థానాన్ని ఆదిరెడ్డి వాసుకు టీడీపీ ఖరారు చేసింది. పలు ఎంపీ స్థానాల పైనా స్పష్టత రావాల్సి ఉందని కూటమి పార్టీలు పేర్కొంటున్నాయి. రేపు లేదా ఎల్లుండి చంద్రబాబు, పవన్‌తో బీజేపీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ విడివిడిగా భేటీ కానున్నట్లు సమాచారం. శివ ప్రకాష్ భేటీ తర్వాత రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదలపై క్లారిటీ రానుంది. రెండో విడత జాబితాలో కొన్ని ఎంపీ స్థానాలకూ అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రకటించనున్నారు. అటు జనసేన కూడా అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో నిమగ్నమై ఉంది. పవన్‌ కల్యాణ్‌ ఎక్కడి నుంచే పోటీ చేస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కాకినాడ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటి చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో కాపులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో పవన్‌ ఈ స్థానాన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. శనివారం మలి విడతగా కేంద్రమంత్రి అమిత్‌ షా , టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన నేత పవన్‌కల్యాణ్‌ మధ్య జరిగిన చర్చలు కొలికివచ్చాయి.ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో అన్న అంశంపై క్లారిటీ కూడా వచ్చినట్లు సమాచారం. అయితే అంతకుముందు ఎంపీగా, ఎమ్మెల్యేగా రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపిన పవన్‌ బీజేపీ పెద్దల సూచనతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది.