Sonia Gandhi: సోనియా గాంధీ చిన్ననాటి ఇంటికి కొత్త రూపు.. మ్యూజియంగా మార్చేందుకు సిక్కు వ్యాపారి ప్రయత్నం!

Sonia Gandhi

Sonia Gandhi

Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన బాల్యాన్ని గడిపిన ఇటలీలోని ఇంటిని మ్యూజియంగా మార్చే ప్రయత్నాలు జరుతున్నాయి. ఇటలీలో నివసిస్తున్న సిక్కు వ్యాపారవేత్త సుఖ్‌దేవ్ సింగ్ కాంగ్ ఈ ఇంటిని ఆరేళ్ల క్రితం కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ ఇంటిని మ్యూజియంగా మార్చాలని ఆయన భావిస్తున్నారు. సోనియా గాంధీ కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాలు, వస్తువులను ఇందులో ప్రదర్శించాలని భావిస్తున్నారు. దీని కోసం గాంధీ కుటుంబాన్ని కలవాలని ఆయన భావిస్తున్నారు. ఈ ఇంటిని ‘‘ ఇండియన్ హౌజ్’’ అని పిలుస్తారని, ఇంటిపై త్రివర్ణ పతాకం ఉంటుందని బయట నేమ్ ప్లేట్‌పై ‘‘సోనియా గాంధీ జన్మస్థలం’’ అని ఉంటుందని ఆయన చెప్పారు.

ఇటలీలోని విసెంజా ప్రావిన్స్‌లోని లుసియానాలో ఈ ఇళ్లు ఉంది. ప్రస్తుతం కాంగ్ నివసిస్తున్న బ్రెసియాకు ఇది కేవలం గంట ప్రయాణ దూరంలోనే ఉంది. సోనియా గాంధీ 1946 డిసెంబర్ 9న ఈ ఇంట్లోనే జన్మించారని, తన బాల్యంలో తొలి సంవత్సరాలను ఇక్కడే గడిపారని కాంగ్ వివరించారు. పంజాబ్ హోషియార్‌పూర్ జిల్లాకు చెందిన ఆయన 1992లో ఇటలీకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తొలినాళ్లలో ఇటలీలో ఆయన డెయిరీఫామ్, వ్యవసాయ రంగం, ఫ్యాక్టరీల్లో పనిచేసినట్లు చెప్పారు. 2020లో తన భార్య,కుమార్తెల పేర్ల మీద ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. తాము గాంధీ కుటుంబానికి అభిమానులమని కాంగ్ తెలిపారు. ప్రతీ ఏడాది సోనియా గాంధీ పుట్టనరోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.