కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) ఈసారి రాజ్యసభకు (Rajya Sabha) పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్‌సభకు కాకుండా రాజ్యసభకు వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ (Rajasthan) నుంచి రాజ్యసభకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాయబేరేలి కంచుకోటగా ఉన్నప్పటికీ ఈసారి సోనియాగాంధీ రాజ్యసభకు పోటీ చేస్తారనే ఊహాగానాలు వినపడతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ అభ్యర్థిగా కర్ణాటక నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అలాగే సైయర్ నసీర్ హుస్సేన్‌కు కూడా తిరిగి టిక్కెట్ ఇస్తారని, అజయ్ మాకెన్‌కు కూడా రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది.
రాజ్యసభ ఎన్నికలకు గత జనవరి 29న ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఫిబ్రవరి 15వ తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా, ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 20తో ముగుస్తుంది. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ పోలింగ్ జరిపి.. 5 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు.