Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం

Saonam

Saonam

Sonam Wangchuk: తన ఆమరణ నిరాహార దీక్ష 25వ రోజుకు చేరుకున్న వేళ.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి బెడ్ పైనుంచే ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “నేను ఇంకా బ్రతికే ఉన్నాను” (అభీ భీ జిందా హూన్) అంటూ ప్రారంభమైన ఆ ఆరు నిమిషాల వీడియోలో ఆయన తన ఆరోగ్య పరిస్థితిని, ఉద్యమ భవిష్యత్తును వివరించారు. దీక్ష కారణంగా తాను సుమారు 11 కిలోల బరువు తగ్గడమే కాకుండా కండరాల క్షీణతను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణ కోసం మంగళవారం రాత్రి తనను ఆసుపత్రిలో చేర్చినట్లు పేర్కొన్నారు. సోమవారం నాటి ‘ఛలో సంసద్’ మార్చ్‌లో పాల్గొన్న విద్యార్థుల తీరును వాంగ్‌చుక్ కొనియాడారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసినప్పటికీ విద్యార్థులు ఎంతో ఓర్పుతో, శాంతియుతంగా నిరసన తెలపడం తనను ఎంతగానో కదిలించిందని, వారి నిగ్రహమే తన దీక్షను కొనసాగించేలా సంకల్పాన్ని మరింత బలపరిచిందని వ్యాఖ్యానించారు.

“లాఠీ దెబ్బలు తిన్నా కూడా ఎదురుదాడికి దిగకుండా మిక్కిలి ఓపికను ప్రదర్శించిన విద్యార్థులందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. వారిపై జరిగిన దమనకాండను చూశాకే నేను దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకున్నాను” అని స్పష్టం చేశారు. అయితే, విద్యార్థులపై ఎలాంటి పోలీసు చర్యలు, ఎఫ్‌ఐఆర్‌లు, అరెస్టులు లేదా వేధింపులు ఉండవని ప్రభుత్వం హామీ ఇస్తే తాను వెంటనే దీక్ష విరమించేందుకు సిద్ధంగా ఉన్నానని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. “కేంద్ర మంత్రులతో సహా అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు దీక్ష విరమించాలని నన్ను కోరారు. నా పని నాకు చాలా ముఖ్యమైనది కాబట్టి నేను కూడా దీక్షను ముగించాలనుకుంటున్నాను. కానీ విద్యార్థులపై బలప్రయోగాన్ని నిలిపివేసి, వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోమని ప్రభుత్వం హామీ ఇవ్వాలి. ఆ హామీ ఇప్పుడే లభిస్తే, నేను ఈరోజే నిరాహార దీక్షను విరమిస్తాను. లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో దీక్షను కొనసాగించాల్సి వస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. దీనికి ముందు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు రాసిన లేఖను కూడా వాంగ్‌చుక్ విడుదల చేశారు. ఆస్పత్రికి వచ్చి తన ఆరోగ్యం గురించి విచారించి, దీక్ష విరమించాలని కోరినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. తాను తిరిగి తన పనిలోకి వెళ్లాలనుకుంటున్నానని, అయితే ఆందోళనలో పాల్గొన్న యువతపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు ఉండవని ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంతవరకు అది సాధ్యపడదని లేఖలో స్పష్టం చేశారు. జవాబుదారీతనం ఉన్న విద్యావ్యవస్థ కోసం గొంతుత్తడమే ఆ విద్యార్థులు చేసిన ఏకైక ‘నేరం’ అని, కాబట్టి వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని ఆయన కోరారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 65 మంది ఎంపీలు నేరుగా కలసి లేదా లేఖల ద్వారా తనను పరామర్శించి దీక్ష విరమించాలని కోరినట్లు వాంగ్‌చుక్ తెలిపారు.