ఖలిస్థాన్ కు మద్దతుగా మరోసారి నినాదాలు రాసిన ఉదంతం ఢిల్లీలో వెలుగు చూసింది. కరోల్ బాగ్, ఝండేవాలన్ మెట్రో స్టేషన్ల క్రింద ఖలిస్థాన్ అనుకూల నినాదాలు కనిపించాయి. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు సమాచారం అందిన వెంటనే వారి బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. దేశ వ్యతిరేక నినాదాలను బృందం సభ్యులు తొలగించారు. ఈ ఘటనపై మెట్రో పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖలిస్థాన్ జిందాబాద్ అనే నినాదాలు ఎవరు రాశారో.. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకోసం సీసీటీవీ ఫుటేజీల సాయం తీసుకుంటున్నారు.
READ MORE: Viral Video: అసలు ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి ఐడియాలు.. కారులోనే దుకాణం పెట్టేసిన ఘనుడు..
అయితే అమెరికాలో కూర్చున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపవంత్ సింగ్ పన్ను ఖలిస్థాన్ కి మద్దతుగా సోషల్ మీడియాలో నినాదాలు రాసే బాధ్యతను తీసుకున్నట్లు సమాచారం. ఢిల్లీ గోడలపై మళ్లీ ఖలిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు, దీని వెనుక తీవ్రవాది గురుపవంత్ పన్ను ఉన్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో అతనిపై హత్యాయత్నం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. హత్యకు భారత్ కుట్ర పన్నిందని ఆరోపించారు. అయితే భారత్ దానిని పూర్తిగా తిరస్కరించింది. ఈ విషయంలో భారత్‌కు వ్యతిరేకంగా అమెరికా వద్ద ఎలాంటి ఆధారాలు లేవని రష్యా కూడా చెబుతోంది.
ఢిల్లీ గోడలపై ఖలిస్థాన్ కు మద్దతుగా నినాదాలు రాయడం ఇదేమి మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ్ నగర్‌లో ఖలిస్థాన్ కు మద్దతుగా నినాదాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అప్పుడు ప్రభుత్వ పాఠశాల గోడపై ఇలాంటి నినాదాలు రాశారు. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాటిని తొలగించారు. ప్రస్తుతం మాత్రం రద్దీగా ఉండే మెట్రో ప్రాంతాల్లో రాయడం గమనార్హం.