SLBC Tunnel: శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటన ఉత్కంఠను పెంచుతోంది. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలవుతున్న, చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. శిథిలాల్లో చిక్కుకున్న ఈ కార్మికులను రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, చిక్కుకున్న కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారి క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ టన్నెల్ ప్రమాదంలో ఇద్దరు ఇంజినీర్లు, ఆరుగురు కూలీలు మట్టి బురదలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని సమాచారం. వారిని కాపాడేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ఇప్పటికే NDRF (National Disaster Response Force) బృందాన్ని సహాయక చర్యల కోసం రంగంలోకి దింపారు. అంతేకాకుండా భారత సైన్యం, రెస్క్యూ టీమ్ సహాయం కూడా కోరినట్లు మంత్రులు తెలిపారు.
Read Also: Hyderabad: భర్త వేధింపులకు మరో మహిళ బలి?
సహాయక బృందాలు టన్నెల్‌లోని నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాయి. డీ-వాటరింగ్ కోసం ప్రత్యేక బృందాలు టన్నెల్‌లో ప్రవేశించాయి. 12 కిలోమీటర్ల తరువాత బురద, నీరు అధికంగా ఉండటంతో NDRF బృందం వెనుదిరిగింది. విద్యుత్ పునరుద్ధరణ, ఆక్సిజన్ పైప్‌ల ఏర్పాటు, నీటి తొలగింపు కోసం ఇంజినీర్లు చర్యలు తీసుకుంటున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌తో సహాయక చర్యలు ప్రారంభించగా.. లోపల 8 మీటర్ల మేరకు మట్టి, నీరు చేరిందని అధికారులు తెలిపారు.
Read Also: Daaku Maharaaj : నెట్ ఫ్లిక్స్ లో డాకుమహారాజ్ సంచనలం.. ఏకంగా పాకిస్థాన్ లో
అధికార బృందాలు శ్రమిస్తున్న ఇప్పటికి లోపల చిక్కుకున్న కార్మికుల గురించి ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, వారి ప్రాణాలను రక్షించగలమా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. రెస్క్యూ టీమ్‌ల ప్రయత్నాలు వేగంగా సాగుతున్నా.. లోపల భారీగా నీరు, బురద ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ విభాగం, రక్షణ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇక త్వరలోనే చిక్కుకున్న కార్మికులను రక్షించి సురక్షితంగా బయటకు తీసుకురావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.