Nizamabad : నిజామాబాద్ డిచ్ పల్లిలో దారుణం చోటు చేసుకుంది. తల్లితో సహజీవనం చేస్తూ ఆమె ఆరేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. కామంతో కళ్లు మూసుకుపోయి తండ్రిలా చూసుకోవాల్సినవాడు ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ విషయం భయటపడకుండా బాలికది సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ అతడి పాపం పండి బయటపడింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ.. భర్తను కోల్పోయి ఆరేళ్ల కూతురితో కలిసి జీవిస్తోంది. వ్యవసాయ కూలీగా పనిచేసే ఆమె మరికొందరు కూలీలతో కలిసి ఇటీవల డిచ్ పల్లి మండలంలోని ధర్మారం గ్రామానికి నాలుగునెలల క్రితం వలస వెళ్లింది. ఈ సమయంలో ఒంటరిగా జీవిస్తున్న ఆమెపై గోవింద్ రావు కన్నుపడింది. మాయమాటలతో మహిళను లోబర్చుకున్నాడు. ఆ మహిళకు మొదటి భర్త ద్వారా పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు తమకు అడ్డుగా భావించాడు. వారం క్రితం ఆరేళ్ల వయసున్న పెద్ద కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తీవ్ర రక్త స్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆపై ఆమె తలపై రాయితో కొట్టి గాయపర్చాడు. దీంతో గోవింద్ రావు మెల్లిగా అక్కడినుండి జారుకున్నాడు.
తల్లి ఇంటికి వచ్చేసరికి కూతురు స్పృహతప్పి పడివుండటాన్ని చూసి కంగారుపడి నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా వుండటంతో హైదరాబాద్ నీలోఫర్ కు తరలించాలని డాక్టర్లు సూచించారు. దీంతో ప్రియుడు గోవింద్ రావుతో కలిసి కూతురిని తీసుకుని హైదరాబాద్కు వెళ్లింది. అక్కడ చికిత్సపొందుతూ బాలిక మృతిచెందింది. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం జరిగితే అత్యాచారం విషయం బయటపడుతుందని గోవింద్ రావు తెలుసుకున్నాడు. దీంతో బాలిక తల్లిని ఒప్పించి సహజ మరణమేనని చెప్పి మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే హాస్పిటల్ సిబ్బంది డిచ్ పల్లి పోలీసులకు సమాచారం అందించగా వారు బాలిక మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో బాలికపై అత్యాచారం జరిగినట్లు బయటపడింది. పోలీసులు బాలిక తల్లితో పాటు ఆమె సహజీవనం చేస్తున్న గోవింద్ రావు ను విచారించగా అసలు నిజం బయటపడింది. బాలికపై తానే అత్యాచారానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో ఫోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు జైలుకు పంపారు.
Read Also:Raj Tarun: నీ అంతు చూస్తా.. మీకు ఆ అమ్మాయి కనపడితే చెప్పమంటున్న రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?