SIT Investigation on Violence: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా నియమించారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. ఈ క్రమంలోనే సిట్ బృందం వేగంగా విచారణ జరుపుతోంది.
Read Also: AP-Telangana Rains: ఏపీ, తెలంగాణల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్..
పోలింగ్ అనంతర అల్లర్లపై సిట్ విచారణ నేడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిన్నటి నుంచే సిట్ రంగంలోకి దిగింది. తాడిపత్రి, నరసరావు పేట, తిరుపతిలో శనివారం నుంచే సిట్ టీమ్ విచారిస్తోంది. ఇప్పటికే అల్లర్లపై నమోదైన కేసులను సిట్ బృందం పరిశీలించింది. కేసులు నమోదైనా అరెస్ట్ అవ్వని నేతలు ఎక్కడున్నారనే దానిపై ఆరా తీస్తోంది. సీసీ టీవీ ఫుటేజ్ లు, వీడియోలు, ఫొటోస్ ద్వారా కొన్ని కొత్త కేసులు నమోదు చేయనుంది. ఇవాళ సాయంత్రానికి విచారణ నివేదికను అందించేలా ప్రత్యేక విచారణ బృందం పని చేస్తోంది. సిట్ విచారణకు 2 రోజుల గడువు ఇవాళతో ముగియనున్న నేపథ్యంలో ముమ్మర విచారణ చేపట్టింది సిట్ బృందం. తిరుపతిలో సిట్ బృందం విచారణ కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో కేసులతో పాటు అల్లర్లకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ వివరాలను అధికారులు పరిశీలించారు.