Sini Shetty Comments On Representing India in Miss World 2024: 71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదికగా నిలిచింది. 1996లో బెంగళూరులో చివరిసారిగా మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. 2024 ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ కార్యక్రమం.. మార్చి 9 వరకు కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఢిల్లీ, ముంబై నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 71వ మిస్ వరల్డ్ ఎడిషన్‌లో 130కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. ఈ పోటీలలో భారత్ నుంచి కన్నడ అమ్మాయి సినీ శెట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మిస్ వరల్డ్ 2024 పోటీల కోసం సినీ శెట్టి ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘నువ్వే నా లక్ష్యం, నువ్వే నా గుర్తు’ అని తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. ‘దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఒక గౌరవం. ప్రపంచ వేదికపై మన జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నా. నా ప్రతి గుండె చప్పుడు భారతదేశం కోసం కొట్టుకుంటుంది. ఈ ప్రయాణంలో ఈరోజు నేను నాకంటే ఉన్నత స్థానంలో ఉన్నా. నేను త్రివర్ణ పతాకాన్ని నా చేతుల్లోనే కాదు, నా హృదయంలో పెట్టుకున్నా. ఈ క్షణం నుండి నేను కేవలం సినీ శెట్టిని మాత్రమే కాదు.. నేను ఇండియన్. నేను వేసే ప్రతి అడుగు, నేను మాట్లాడే ప్రతి మాట నన్ను పెంచిన భూమి కోసమే’ అని సినీ శెట్టి పేర్కొన్నారు.
Also Read: Mobile Phones Ban: ప్రధాని కీలక నిర్ణయం.. తరగతి గదుల్లోకి మొబైల్స్ ఫోన్స్ నిషేధం!
ముంబైలో జన్మించిన 21 ఏళ్ల సినీ శెట్టి స్వస్థలం కర్ణాటక. అకౌంటింగ్, ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేట్ చేసిన సినీ శెట్టి.. భరతనాట్యంలో శిక్షణ పొందారు. భారత్ నుంచి ప్రపంచ సుందరి పోటీల్లోకి అడుగుపెట్టిన ఆమెకు అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. 1966లో భారత్ తరఫున రీటా ఫారియా తొలిసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు. 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.