పోంజీ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని జనాలను మోసం చేసి.. ఏకంగా రూ.6 వేల కోట్లను బీజెడ్ గ్రూప్ పోగేసింది. ఈ స్కామ్‌లో బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝలాను గుజరాత్ సీఐడీ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే అరెస్ట్ చేసింది. అయితే పోంజీ స్కామ్‌లో గుజరాత్ సీఐడీ సమన్లు పంపే అవకాశం ఉన్న నలుగురు గుజరాత్ టైటాన్స్ క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నాడు. త్వరలోనే గిల్‌కు సమన్లు జారీ చేసి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పోంజీ కుంభకోణం బాధితుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నాడు. ఓ నివేదిక ప్రకారం గిల్ రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ క్రికెటర్స్ సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, రాహుల్ తెవాతియాలు కూడా ఇందులో పెట్టుబడి పెట్టినట్లు తాజాగా బయటకొచ్చింది. ఈ ముగ్గురు గిల్ మాదిరి పెద్ద మొత్తంలో కాకుండా.. తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేశారట. బీజెడ్ గ్రూప్‌నకు చెందిన రూ.450 కోట్లకు సంబంధించి లావాదేవీలపై సీఐడీ ఆరా తీస్తోంది. అందులో భాగంగా ఈ నలుగురు క్రికెటర్లకు సమన్లు జారీ చేయనుందట. ప్రస్తుతం గిల్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. అతడు భారత్‌కు వచ్చాక సమన్లు జారీ చేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామని గుజరాత్‌లోని పలు ప్రాంత ప్రజలను బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ నమ్మించారు. ఏజెంట్ల ద్వారా కోట్లు వెనకేశారు. మూడు నెలల క్రితం కొందరు వ్యక్తులకు బీజెడ్ సంస్థపై అనుమానం రావడంతో.. సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోంజీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందికి పైగా ఏజెంట్లను సీఐడీ అరెస్ట్ చేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.