Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మ‌న్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!

  • వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్
  • ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడ్డ కెప్టెన్ శుభ్‌మన్ గిల్
  • మహ్మద్ సిరాజ్ వేసిన బౌన్సర్ గిల్ కుడి మోచేతికి గాయం..
Shubman Gill

Shubman Gill

Shubman Gill Injury: వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన బౌన్సర్‌ నేరుగా గిల్ కుడి మోచేతికి తగలడంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. ఆ నొప్పి భరించలేక వెంటనే నెట్స్‌ నుంచి బయటకు వెళ్లాడు టీమిండియా కెప్టెన్.

గిల్‌కు గాయం కావడంతో ముందుగా ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చారు. సుమారు 20 నిమిషాల పాటు వైద్య బృందం గిల్‌ను పరిశీలించింది. దీనితో అతడి కుడి మోచేతికి పట్టీ కట్టారు. ఆ తర్వాత డగౌట్‌లో విశ్రాంతి తీసుకుంటున్న గిల్‌ వద్దకు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ స్వయంగా వెళ్లి గాయం పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. అయితే నొప్పి తగ్గిన తర్వాత గిల్ మళ్లీ నెట్స్‌లోకి వచ్చి బంతులను ఎదుర్కొన్నాడు. దీంతో టీమిండియా శిబిరంలో కాస్త ఊరట కనిపించింది.

గిల్‌కు గాయం కావడానికి కొద్దిసేపటి ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి దాదాపు 20 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. గత సిరీస్‌కు దూరంగా ఉన్న కోహ్లీ పూర్తి లయలో కనిపించాడు. ఇద్దరూ భారత బౌలర్లతో పాటు స్థానిక నెట్ బౌలర్ల బౌలింగ్‌లో అద్భుతమైన షాట్లు ఆడారు. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ జట్టులోని సీనియర్ ఆటగాళ్ల పాత్రను ప్రశంసించాడు. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు అద్భుతంగా పనిచేశాడని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు తమకు సౌకర్యంగా అనిపించే సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడేందుకు ఇష్టపడతారని.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞుల సహకారం జట్టుకు ఉండటం జట్టు అదృష్టమని ఆయన అన్నారు. సెప్టెంబర్ 27న తొలి వన్డే తిరువనంతపురం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మొదలు కానుంది.