దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు కోర్టులో స్వల్ప ఊరట లభించింది. రోజుకు ఎనిమిది గంటల పాటు ఏకాంత సెల్ నుంచి బయటికి రావడానికి అనుమతించాలని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీహార్ జైలు అధికారులకు ఆదేశించింది.
శ్రద్ధా వాకర్ ను చంపి.. ఆమె శరీరాన్ని అనేక ముక్కలుగా నరికి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆఫ్తాబ్ విసిరేశాడు. అయితే నేరం జరిగిన ఆరు నెలల తర్వాత ఈ కేసు వెలుగు చూసింది. ఆఫ్తాబ్ చేసిన అనాగరికతపై దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
పూనావాలా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సురేష్ కుమార్ కైట్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకాంత సెల్ నుంచి విడిచిపెట్టాలని ఆదేశాలను జారీ చేసింది. పూనావాలా తరపు న్యాయవాది వాదిస్తూ.. ఇతర ఖైదీలను రోజుకు ఎనిమిది గంటల పాటు బయట ఉండేలా అనుమతిస్తారు. కానీ పూనావాలాను ఇంతవరకు ఉదయం, సాయంత్రం గంటపాటే బయట ఉండేందుకు అనుమతించారు. ఇకపై ఇతర ఖైదీల మాదిరిగా 8 గంటల పాటు అతడిని అన్‌లాక్ చేసి, రాత్రిపూట ఒంటరిగా సెల్‌లో ఉంచాలని జస్టిస్ గిరీష్ కత్పాలియాతో కూడిన ధర్మాసనం జైలు అధికారులను ఆదేశించింది.
కాగా గతంలో పూనావాలాను రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి తీసుకెళ్తుండగా అతడిపై దాడి జరగడంతో తగిన భద్రత కల్పించాలని ట్రయల్ కోర్టు అప్పట్లో ఆదేశాలు జారీ చేసిందని, అందువల్లే నిందితుడిని, ఇతర ఖైదీలతో కలిపి ఉంచడం లేదని జైలు అధికారుల తరపున న్యాయవాది తెలిపారు.
2022, మే18న ఢిల్లీలోని మెహ్రౌలీలో తన ప్రియురాలు శ్రద్ధా వాకర్‌ను గొంతు కోసి, ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి చంపినట్లు పూనావాలాపై ఆరోపణలు వచ్చాయి. శరీర భాగాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచి అడవిలో వాటిని పారవేసినట్లుగా పోలీసులు తెలిపారు. 2023 జనవరి 24న ఢిల్లీ పోలీసులు ఈ కేసులో 6,629 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. అనంతరం ట్రయల్ కోర్టు పూనావాలాపై హత్య, సాక్ష్యాధారాల అదృశ్యం ఆరోపణలను నమోదు చేసింది.