HMDA: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. శివ బాలకృష్ణను ఎనిమిది రోజుల పాటు కస్టడికి అనుమతిస్తూ నిన్న ( మంగళవారం ) ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు కస్టడీలో విచారించనున్నారు. అయితే, శివబాలకృష్ణను 10 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పీపీ కోర్టును కోరగా 8 రోజుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేడు చంచలగూడ జైలు నుంచి శివ బాలకృష్ణను కస్టడీలోకి ఏసీబీ అధికారులు తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా అతనికి వచ్చిన ఆదాయం ఎంత? అతని ఆస్తులు ఎంత? అనే దానిపై విచారణ చేయనునన్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, ఇప్పటికే హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, హెచ్ఎండీఏ, ఎంఏయుడీ, రేరాల్లో ఆయన పని చేసిన సమయంలో అనుమతులు ఇచ్చిన ఫైళ్ళపై ఏసీబీ అధికారులు దృష్టి సారించనున్నారు. శివ బాలకృష్ణకు చెందిన 8 బ్యాంకు లాకర్లతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను ఏసీబీ తెరిచేందుకు ప్లాన్ చేస్తుంది. కాగా, హైదరాబాద్ నగర శివారులో జరిగిన భూ బదలాయింపులు, అపార్ట్ మెంట్స్, విల్లాల నిర్మాణాల్లో ఒక్క సంతకంతో స్థలాలు కాజేశారంటూ పలువురు బాధితులు ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.