Shikhar Dhawan Played Under Shashank Singh Captaincy: గురువారం రాత్రి అహ్మదాబాద్‌లో చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఓడిపోయే మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించడానికి కారణం ‘శశాంక్ సింగ్’. సంచలన బ్యాటింగ్‌తో గుజరాత్ నుంచి శశాంక్ మ్యాచ్ లాగేసుకున్నాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లు విఫలమైన చోట 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి.. పంజాబ్‌కు ఊహించని విజయాన్ని అందించాడు. అయితే పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఇటీవల శశాంక్ కెప్టెన్సీలో ఆడాడు.
ఇటీవల ముంబైలో జరిగిన డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్‌లో గ్రూప్ బి జట్టుకు 32 ఏళ్ల శశాంక్ సింగ్ నాయకత్వం వహించాడు. శశాంక్ కెప్టెన్సీలో భారత వెటరన్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, దినేశ్ కార్తిక్‌లు ఆడారు. వీరితో పటు ఆయుష్ బదోనీ కూడా ఆడారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్‌కు వచ్చేసరికి ధావన్, శశాంక్ పాత్రలు మారిపోయాయి. ఐపీఎల్ 2024లో ధావన్ కెప్టెన్సీలో శశాంక్ ఆడుతున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్ అనంతరం శశాంక్ ఆటతీరును ధావన్ మెచ్చుకున్నాడు. శశాంక్ బాగా ఆడాడని, సిక్స్‌లు కొట్టిన తీరు అద్భుతం అని ప్రశంసించాడు.
Also Read:
శశాంక్ సింగ్ పంజాబ్ కింగ్స్ జట్టులోకి నాటకీయ పరిణామాల మధ్య వచ్చాడు. వేలంలో గందరగోళ పరిస్థితుల చోటుచేసుకున్నాయి. ముందుగా పంజాబ్ అతడిని వద్దనుకుంది. శశాంక్ పేరు వేలంలోకి రాగానే.. కనీస ధర రూ.20 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే తర్వాత తాము తీసుకోవాలనుకున్న శశాంక్ అతడు కాదని, మరొకరని పంజాబ్ చెప్పింది. అప్పటికే వ్యాఖ్యాత వేలాన్ని ముగించడంతో.. శశాంక్‌ను పంజాబ్ అంగీకరించక తప్పలేదు. ఇద్దరు ఆటగాళ్లు ఒకే పేరుతో ఉండటంతో గందరగోళం తలెత్తిందని, తాము సరైన శశాంక్‌నే జట్టులోకి తీసుకున్నాం అని పంజాబ్ తర్వాత పేర్కొంది. అప్పుడు వద్దనుకున్నవాడే.. ఇప్పుడు ఆ జట్టుకు వరమయ్యాడు.