Site icon NTV Telugu

Shashi Tharoor: “కాంగ్రెస్‌ పుండుపై కారం”.. పుతిన్ డిన్నర్‌పై శశి థరూర్ కీలక వ్యాఖ్యలు..

Shashi Tharoor

Shashi Tharoor

Shashi Tharoor: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను ఆహ్వానించారు. శనివారం ఈ విందుపై థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పుతిన్‌తో డిన్నర్ జరిగిందని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ స్టేట్ డిన్నర్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశం అయింది. వీరిద్దర్ని ఆహ్వానించకుండా శశిథరూర్‌ను పిలవడంపై కాంగ్రెస్ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది.

Read Also: Tata Harrier.ev: నెక్సాన్.evని దాటి, దుమ్మురేపుతున్న టాటా హారియర్.ev సేల్స్..

శనివారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించిన విందులో పాల్గొన్న థరూర్, రష్యా ప్రతినిధి బృందంతో తన సంభాషణల్ని ఆస్వాదించినట్లు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. “నిన్న రాత్రి అధ్యక్షుడు పుతిన్ కోసం @rashtrapatibhvn విందుకు హాజరయ్యాను. ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన వాతావరణం నెలకొంది. హాజరైన చాలా మందితో, ముఖ్యంగా రష్యన్ ప్రతినిధి బృందంలోని సహచరులతో నా సంభాషణలను ఆస్వాదించాను!” అని ఆయన పోస్ట్ చేశారు.

అయితే, ఇప్పటికే పుతిన్ డిన్నర్ కాంగ్రెస్‌లో విభేదాలను బయటకు తీసుకువచ్చింది. గత కొంత కాలంగా శశి థరూర్ బీజేపీ ప్రభుత్వ పనితీరు, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పెద్దలకు నచ్చడం లేదు. తాజాగా, ఈ డిన్నర్‌కు రాహుల్, ఖర్గేలను ఆహ్వానించకపోగా, శశి థరూర్‌ను ఆహ్వానించడం రచ్చకు దారితీసింది. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఈ ఆట అర్థం కావడం లేదా అని థరూర్‌ను ప్రశ్నించారు. పుతిన్ భారత్‌లో ల్యాండ్ కావడానికి ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం విదేశీ ప్రతినిధుల్ని, ప్రతిపక్ష నేతలను కలవకుండా కట్టడి చేస్తున్నారని ఆరోపించారు.

Exit mobile version