Shane Warne: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ (Shane Warne) మరణానికి సంబంధించిన ఘటనలో కొత్త మలుపు తిరిగింది. 2022 మార్చి 4న థాయ్‌లాండ్ లోని కోహ్ సమూయి ద్వీపంలోని ఓ విల్లాలో ఆయన హఠాన్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో గుండెపోటే ప్రధాన కారణమని భావించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం సంఘటనా స్థలంలో ఓ కీలకమైన ‘వస్తువు’ తొలగించబడినట్లు బ్రిటన్ మీడియా సంస్థ డైలీ మెయిల్ సంచలన కథనం ప్రచురించింది. ఈ విషయాలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.
Read Also: CM Revanth Reddy: ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని ఈ పథకం తీసుకొచ్చాము..
థాయ్‌లాండ్ పోలీసులు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. షేన్ వార్న్ మరణించిన చోట లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఓ ఔషధ బాటిల్ లభ్యమైంది. కానీ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ మాత్రలను అక్కడి నుంచి తొలగించామని ఓ పోలీసు అధికారి తెలిపాడు. అంతేకాకుండా సంఘటనా స్థలంలో వాంతులు, రక్తపు మరకలు కూడా ఉన్నాయని, వాటిని కూడా శుభ్రం చేయాలని ఆదేశాలు వచ్చాయని ఆయన చెప్పాడు. అయితే, షేన్ వార్న్ ఈ మాత్రలను ఎంత మోతాదులో తీసుకున్నారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదని పేర్కొన్నాడు.
ఈ ఘటనలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఇందులో ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షేన్ వార్న్ మరణించిన తీరు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారొచ్చనే ఉద్దేశంతో కొంతమంది ఉన్నతాధికారులు దీనిని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా పోలీసు అధికారి చేసిన ప్రకటనలతో మరింత అనుమానాలు పెరిగిపోతున్నాయి. షేన్ వార్న్ అస్వస్థతకు గురై విల్లాలోనే అచేతనంగా పడిపోయారని, అప్పుడు వైద్య సిబ్బంది ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారని సమాచారం. ఆయన మరణానికి గుండెపోటే కారణమై ఉండొచ్చని కుటుంబ సభ్యులు అప్పట్లో ప్రకటించారు. అయితే స్థానిక ఆసుపత్రి ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో మాత్రం షేన్ వార్న్ సహజ మరణం చెందారని, ఇందులో ఎటువంటి నేరపూరిత కోణం లేదని పేర్కొన్నారు. కానీ, తాజా సమాచారంతో కొత్త కోణాలు బయటకు రావడం, మరణానికి గల అసలైన కారణంపై ఇంకా అనేక అనుమానాలు మిగిలిపోవడం క్రికెట్ అభిమానులను మరోసారి కుదిపేస్తున్నాయి.