Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..

Hope

Hope

ఇండోర్‌లోని హోల్కర్ వేదికగా సాగిన ఉత్కంఠభరిత మూడో టీ20 సమరంలో భారత జట్టు 14 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై అద్భుత విజయం సాధించింది. ఈ ఓటమి అనంతరం వెస్టిండీస్ సారథి షాయ్ హోప్ మాట్లాడుతూ.. తమ పరాజయానికి గల ప్రధాన కారణాలను విశ్లేషించాడు. మైదానంలో చోటుచేసుకున్న చిన్నచిన్న పొరపాట్లే అంతిమంగా మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయని ఆయన పేర్కొన్నాడు.

బౌండరీల వద్ద అదనపు పరుగులు నియంత్రించకపోవడం, ఫీల్డింగ్‌లో చేసిన తప్పుల వల్ల చివర్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని హోప్ స్పష్టం చేశాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పవర్ ప్లేలోనే వరుసగా కీలక వికెట్లు కోల్పోవడం జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిందని అంగీకరించాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో మంచి భాగస్వామ్యం లభించి ఉంటే మిడిలార్డర్ బ్యాటర్లకు పని సులువయ్యేదని, అయితే ఈ పరాజయాన్ని ఏ ఒక్కరిపైనో నెట్టేయలేమని, ఇది సమిష్టి వైఫల్యమని వివరించాడు. అయినా రెండో టీ20లో భారీ స్కోర్ ఛేదించిన తమకు ఇది సులవు అవుతుందనుకున్నామని.. ఓడిపోయినందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే.. టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ విజృంభించి ఆడుతున్న సమయంలో రోస్టన్ చేజ్ కీలక వికెట్లు తీసి రన్ రేట్‌ను అదుపులోకి తెచ్చాడని హోప్ గుర్తుచేశాడు. ప్రత్యర్థిని 223 పరుగులకు ఆలౌట్ చేయడంలో తమ బౌలర్లు చూపిన పోరాటపటమను అతడు కొనియాడాడు.

రెండో ఇన్నింగ్స్ సమయంలో పిచ్ పొడిగా మారడంతో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు ప్రారంభంలో మంచి స్వింగ్ లభించిందని, దాంతో బ్యాటింగ్ చేయడం సవాలుగా మారిందని చెప్పాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమిండియా పేసర్లు కచ్చితత్వంతో వేసిన యార్కర్లే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయని, యార్కర్లను ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో భారత బౌలింగ్ యూనిట్ చక్కగా ప్రదర్శించిందని ప్రశంసించాడు. ఈ లోపాలను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శనతో పుంజుకుంటామని హోప్ ధీమా వ్యక్తం చేశాడు.