Sewerage Overflow Free City : హైదరాబాద్ నగరంలో సీవరేజీ సమస్యలను పరిష్కరించేందుకు జలమండలి చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్ నేటితో విజయవంతంగా ముగిసింది. గాంధీ జయంతి రోజున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 90 రోజులుగా నిర్విరామంగా సాగిన ఈ డ్రైవ్ ద్వారా నగరంలోని 17,050 ప్రాంతాల్లో 2,200 కిలోమీటర్ల సీవరేజీ పైపులైన్, 1.75 లక్షల మ్యాన్ హోళ్లను శుభ్రం చేశారు. ఈ చర్యల ఫలితంగా సీవరేజీ ఫిర్యాదులు 30 శాతం తగ్గాయి.
స్పెషల్ డ్రైవ్ విజయవంతం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులకు అభినందనలు తెలిపారు. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ డ్రైవ్‌ను మరో 90 రోజులు పొడిగించాలని ఆయన ఆదేశించారు. వర్షాకాలానికి ముందు సీవరేజీ పైపులైన్లు మరియు మ్యాన్ హోళ్లలో అన్ని వ్యర్థాలను తొలగించేందుకు మరింత కృషి చేయాలని సూచించారు.
ఈ స్పెషల్ డ్రైవ్ పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక డాష్‌బోర్డు ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో సమస్యల తీవ్రతను గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించి, వాటిని పరిష్కరించారు. ఈ డాష్‌బోర్డు ద్వారా శుభ్రం చేసిన పైపులైన్లు, మ్యాన్ హోళ్ల వివరాలను ఫోటోలతో అప్‌లోడ్ చేస్తూ డేటాను విశ్లేషించేందుకు సౌకర్యం కల్పించారు.
గత మూడు సంవత్సరాల సీవరేజీ ఫిర్యాదులను విశ్లేషించి, ప్రధాన సమస్యలైన ఇంటి చోకేజీలు, రోడ్లపై సీవరేజీ ఓవర్ ఫ్లోపై దృష్టి సారించారు. రోజువారీ ఫిర్యాదులలో 60 శాతం ఇవే ఉండడంతో, వాటి పరిష్కారంపై ప్రత్యేకంగా కృషి చేశారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, “సమిష్టి కృషితోనే స్పెషల్ డ్రైవ్ విజయవంతమైంది. ఈ విజయానికి అన్ని స్థాయిల అధికారుల కృషి ప్రధాన కారణం. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తాం” అన్నారు. ఈ కార్యక్రమం సిటీ శుభ్రతకు కొత్త ఒరవడిని తీసుకురావడం గమనార్హం.
Book Exhibition: నేటి నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం.. 294 స్టాళ్లు ఏర్పాటు!