పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో విపరీతమైన ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వేడిమి కారణంగా గ్యాస్ పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు. సింధ్‌లోని హైదరాబాద్ ప్రాంతంలోని ఓ దుకాణంలో గ్యాస్ సిలిండర్ వేడి కారణంగా పేలిపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రోజు మరణించారని.. మంటల్లో గాయపడిన మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ పేలుడు కారణంగా సమీపంలోని పలు ఇళ్లకు మంటలు వ్యాపించాయని, ప్రజలు మంటల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. మంటలు వేగంగా వ్యాపించాయని దీంతో.. బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పాడి పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
షాప్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉందని.. మొదటి, రెండో అంతస్తుల్లో అపార్ట్‌మెంట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. “పేలుడు తర్వాత, మంటలు త్వరగా నివాస అంతస్తులకు వ్యాపించాయి” అని పోలీసులు పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్‌లో పేలుడు సంభవించడానికి సింధ్‌లో ప్రబలమైన వేడి కారణంగా సంభవించి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలలో ఉష్ణోగ్రత 50 సెంటీగ్రేడ్‌లు దాటింది.