Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్

Seethakka

Seethakka

Seethakka: స్పీకర్‌ను దూషించిన వారిని సభ నుంచి బహిష్కరించాలని మంత్రి సీతక్క శాసన మండలిలో డిమాండ్ చేశారు. మంగళవారం శాసన మండలి సమావేశాల్లో ఆమె మాట్లాడారు. మహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా చేతులు వేసి నెట్టి వేశారని మండిపడ్డారు. మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తే.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన, దళిత వ్యతిరేక నైజం మీది బీఆర్ఎస్‌దని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలు ఎదిగితే ఓర్చుకోలేని భూస్వామ్య విధానం బీఆర్ఎస్‌దన్నారు. మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టి రాజకీయం ఎందుకు చేస్తున్నారని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

“కేటీఆర్ మహిళా పోలీసులపై చేతులు వేశారు. ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను దూషిస్తే యాక్ట్ వర్తిస్తుంది. వీల్లకు తల్లులు లేరా.. లకారంతో ఎలా తిడుతారు? వీళ్లు తల్లులను తిడితే వారు బాధ పడరా? 2018 లో స్పీకర్‌పై దాడి చేశారని నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆర్టికల్ 194 (3) ప్రయోగించి సస్పెండ్ చేశారు. అదే రూల్ బీఆర్ఎస్ సభ్యులకు వర్తింపజెయ్యాలి. అసెంబ్లీలో హరీష్ రావు స్పీకర్ పోడియం మీదకు ఉరుకుతున్నారు. ఏం.. స్పీకర్‌ను కొడుతరా? నిన్న దూషించారు.. నేడు కొడుతారా? నైతిక విలువలు ఉండాలి. సభ సంప్రాదాలు ఉండాలి. ఇప్పటి వరకు స్పీకర్‌కు క్షమాపణ చెప్పలేదు. బీఆర్ఎస్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.” అని శాసన మండలిలో మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.