ఢిల్లీని వణికించిన తీవ్ర వాయు కాలుష్యం.. ఇప్పుడు హర్యానాకు చేరింది. హర్యానాలో కాలుష్య విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. కేవలం ఆన్‌లైన్ తరగతులు మాత్రమే నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లకు లేఖ రాసింది.
ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో తీవ్రమైన ఏక్యూఐ (AQI) స్థాయిలు.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి వరకు విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రస్తుత పరిస్థితిని సంబంధిత డిప్యూటీ కమిషనర్ అంచనా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు. ఆన్‌లైన్ తరగతులను నిర్వహించడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. పాఠశాలల మూసివేతపై జిల్లాల డిప్యూటీ కమిషనర్లు నిర్ణయం తీసుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మహిపాల్ దండా తెలిపారు.
Read Also: Father kills son: చదువుకోవడం లేదని కొడుకుని చంపిన తండ్రి..
హర్యానాలోని ఎనిమిది నగరాల్లో ఏక్యూఐ దారుణంగా ఉంది. భివానీ అత్యంత కలుషితంగా మారింది. భివానీతో పాటు, బహదూర్‌ఘర్, సోనిపట్, జింద్, రోహ్‌తక్, కైతాల్, కర్నాల్, గురుగ్రామ్‌లలో గాలి అత్యంత దారుణ స్థితి ఉంది. అలాగే.. రాష్ట్రంలోని 10 నగరాలలో AQI 200-300 మధ్య చేరుకుంది. ఈ క్రమంలో.. ఫరీదాబాద్, గురుగ్రామ్, నుహ్, రోహ్‌తక్, సోనిపట్, రెవారీ, ఝజ్జర్, పానిపట్, పల్వాల్, భివానీ, చర్కీ దాద్రీ, మహేంద్రగఢ్, జింద్, కర్నాల్ జిల్లాల్లో ఆంక్షలు విధించారు.
హర్యానాలోని ఎన్‌సిఆర్ జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. జనాలు ఇంట్లో నుండి బయటకు రావడమే కష్టంగా మారింది. గ్రేప్-4ను అమలు చేస్తున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడడం లేదు. ఈ క్రమంలో.. వాతావరణం ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు చాలా ప్రమాదకరంగా భావిస్తూ.. పాఠశాలలను ప్రస్తుతానికి మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.