NTV Telugu Site icon

T20 World Cup 2024: భారత్ సెమీస్‌ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయిందిగా!

India Women

India Women

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ కథ ముగిసింది. న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌ గెలిస్తే.. సెమీస్‌ అవకాశాలు ఉంటాయని ఆశించిన టీమిండియాకు నిరాశే మిగిలింది. గ్రూప్‌-ఏ చివరి లీగ్‌ మ్యాచ్‌లో కివీస్‌ 54 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి నాకౌట్‌ చేరింది. ఆస్ట్రేలియా అప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో.. భారత్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. భారత జట్టు ఫామ్, ప్లేయర్స్‌ను చూస్తే కచ్చితంగా సెమీస్‌ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయింది.

టీ20 ప్రపంచకప్‌ కోసం బయల్దేరే ముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చేసిన వ్యాఖ్యలకు, తుది ఫలితంకు ఏ సంబంధం లేదు. టీ20ల్లో ఇదే భారత అత్యుత్తమ జట్టు అని, 12 మందికి ప్రపంచకప్‌ ఆడిన అనుభవం ఉందని, వారి సత్తాపై నాకు బాగా నమ్మకముందన్న హర్మన్‌ప్రీత్‌ వ్యాఖ్యలు అందరిలో టైటిల్ ఆశలు రేపినా.. చివరకు నిరాశ పడక తప్పలేదు. గత మూడు ప్రపంచకప్‌లలో సెమీస్, ఫైనల్, సెమీస్‌ రికార్డు.. యూఏఈలో వాతావరణం, పిచ్‌లు భారత్‌కు అనుకూలం అంటూ జరిగిన ప్రచారం.. డబ్ల్యూపీఎల్‌లో మన ప్లేయర్స్ రాణించడం లాంటివి ఏమీ కలిసిరాలేదు.

Also Read: Monkey Viral Video: ‘మామ ఏక్ పెగ్ లా’ అంటూ.. బీరేసిన కోతి!

టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఒక్కతే రెండు అర్ధ సెంచరీలతో రాణించింది. టాప్‌-5లో మిగతా నలుగురు పూర్తిగా విఫలమయ్యారు. స్మృతి మంధాన మూడు కీలక మ్యాచ్‌లలో తేలిపోయింది. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ కనీస ప్రదర్శన ఇవ్వలేదు. బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్‌ పర్వాలేదనిపించింది. అరుంధతి రెడ్డి, రేణుక సింగ్‌ చెరో 7 వికెట్స్ తీశారు. ఆశా శోభన కూడా రాణించింది. సమష్టి వైఫల్యమే భారత్ కొంపముంచింది. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో భారత్ రెండు గెలిచి, రెండింటిలో ఓడింది.