Saudi hero: నిస్వార్థంగా చేసే పనులకు భగవంతుడు కచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్రతిఫలం అందజేస్తాడు. అచ్చంగా ఈ మాటలకు సరిపోయే సంఘటన సౌదీ అరేబియాలోని అల్-సాలిహియా అనే చిన్న పట్టణంలో చోటుచేసుకుంది. అక్కడ ఓ సామాన్యుడు తన ప్రాణాలను రిస్క్‌లో పెట్టి డజన్ల కొద్దీ ప్రాణాలను కాపాడాడు. ఈప్రయత్నంలో తనకు కొన్ని గాయాలు అయినా కూడా ప్రజల ప్రాణాలను కాపాడటం మాత్రం ఆపలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ సామాన్యుడు వాళ్ల దేశంలో ఒక హీరో. నిజం అండి బాబు.. అక్కడి రాజు ఈ సాధారణ మనిషి అసాధారణమైన ధైర్యానికి ఫిదా అయిపోయాడు. దీంతో మన హీరో రాత్రికిరాత్రే లక్షాధికారి అయిపోయాడు.. అసలు ఏంటి ఈ కథ, ఎవరీ కామన్‌మ్యాన్ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Actors Re-Union : శ్రీకాంత్, అలీ బ్యాచ్ రీ యూనియన్.. ఫొటోలు వైరల్
ప్రాణాలను పణంగా పెట్టి..
ఇది 40 ఏళ్ల మహీర్ ఫహద్ అల్-దల్బాహి కథ. శుక్రవారం మధ్యాహ్నం మాహిర్ తన కారులో అల్-సాలిహియా వీధిలో వెళ్తుండగా కాలిపోతున్న ఓ ట్రక్కును చూశాడు. ఆ ట్రక్కులో పశుగ్రాసం నిండి ఉండటంతో అక్కడ మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భయంతో ట్రక్కు డ్రైవర్ దానిని పెట్రోల్ పంప్ దగ్గర వదిలి పారిపోయాడు. వెంటనే మాహిర్ సమయం వృథా చేయకుండా కాలిపోతున్న ట్రక్కులోకి దూకి దానిని గ్యాస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకెళ్లాడు. ఆయన ధైర్యం చేసి ఉండకపోతే పెట్రోల్ పంప్ మాత్రమే కాకుండా సమీపంలోని ప్రజలకు కూడా పెద్ద ప్రమాదం సంభవించేది. ఆ క్షణంలో మహిర్ దేని గురించి ఆలోచించలేదు. కేవలం ఆ ట్రక్కు అక్కడి నుంచి తీసేయాలి, తోటి వారిని కాపాడాలనే ఆలోచనతో ధైర్యం చేసి దూకేశాడు. మనం పైన చెప్పుకున్నట్లు.. నిస్వార్థంగా చేసే పనులకు భగవంతుడు కచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్రతిఫలం అందజేస్తాడనేది.. మహిర్ విషయంలో కూడా అక్షరాల నిజం అయ్యింది. మన కామన్‌మ్యాన్ ధైర్యసాహసాలు ఆ దేశ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ వరకు చేరాయి. దీంతో మనోడు రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు.
ప్రమాదంలో మహిర్‌కు కొన్ని గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన రియాద్‌లోని కింగ్ సౌద్ మెడికల్ సిటీలో చికిత్స పొందుతున్నాడు. కానీ ఆయన ధైర్యసాహసాల ప్రతిధ్వని సౌదీ రాజభవనం వరకు చేరుకుంది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రతిపాదన మేరకు రాజు సల్మాన్.. మహిర్‌కు కింగ్ అబ్దుల్ అజీజ్ మెడల్ (ఫస్ట్ క్లాస్)తో పాటు 1 మిలియన్ సౌదీ రియాల్స్ (సుమారు రూ. 2.3 కోట్లు) నగదు బహుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి మండుతున్న ట్రక్కును పెట్రోల్ పంప్ నుంచి దూరంగా తరలించి, ఒక పెద్ద విపత్తును నివారించాడని రాజభవనం కొనియాడింది. మహిర్ ధైర్యసాహసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రియాద్ డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ స్వయంగా మహిర్ ఆరోగ్యం గురించి విచారించి, మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఓ పాఠశాల సెక్యూరిటీ గార్డుల సూపర్‌వైజర్ అయిన మహిర్ ఇప్పుడు తన గ్రామానికి మాత్రమే కాకుండా మొత్తం సౌదీ అరేబియాకే హీరోగా మారాడు.
READ ALSO: Donald Trump: ట్రంప్‌కు ఏమైంది.. ప్రపంచం నుంచి ఆయన ఏం దాచిపెడుతున్నారు..