సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, సమాజానికి అద్దం చూపే శక్తివంతమైన మీడియా. అలాంటి సినిమాల్లో ఒకటి ‘సంతోష్’. భారతదేశంలో ఈ సినిమాను బ్యాన్ చేసినప్పటికి, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. చెప్పాలంటే ఈ మూవీ 2025 జనవరి 10న విడుదల కావాల్సింది. కానీ ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) క్లియర్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. కారణం – సినిమాలో స్త్రీ ద్వేషం, కుల వివక్ష, ఇస్లామోఫోబియా, పోలీసుల దౌర్జన్యం వంటి అంశాలను దర్శకురాలు నేరుగా చూపించడం. ఈ అంశాలపై సెన్సార్ బోర్డు అనేక కట్స్ సూచించింది. అయితే దర్శకురాలు సంధ్యా సూరి “ఆ కట్స్ చేస్తే సినిమా ఆత్మనే కోల్పోతుంది” అని అంగీకరించలేదు. దీంతో సినిమా భారతదేశంలో విడుదల కాలేదు. ఈ నిర్ణయంపై ఆమె తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ, “ఇలాంటి విషయాలను చూపిన ఎన్నో సినిమాలు ఇంతకు ముందు వచ్చినా, ‘సంతోష్’ పై మాత్రం ఎందుకింత కఠినంగా వ్యవహరించారో అర్థం కాలేదు” అని వ్యాఖ్యానించారు.
Also Read : Shiva: రామ్ గోపాల్ వర్మ ఎవరో తెలియదు.. కానీ ‘శివ’ నా దృష్టి మార్చేసింది: శేఖర్ కమ్ముల
కథ ప్రకారం, షహానా గోస్వామి నటించిన సంతోష్ సైనీ పోలీస్ కానిస్టేబుల్ గా చేరి, ఒక దళిత యువతి రేప్ & మర్డర్ కేసును దర్యాప్తు చేస్తోంది . ఇన్‌స్పెక్టర్ సునీతా రజ్వార్ తో కలిసి సమాజంలోని అవినీతి, అధికార దౌర్జన్యాన్ని ఎదుర్కొంటుంది. 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత వచ్చిన సామాజిక ఉద్యమం కథకు ప్రేరణ అయ్యింది. ఇండియాలో అడ్డంకులు ఎదురైనా, ‘సంతోష్’ 77వ కేన్స్, 97వ ఆస్కార్ షార్ట్‌లిస్ట్, 78వ బాఫ్టా నామినేషన్ సాధించింది. షహానా గోస్వామి, సునీతా రాజ్వార్ నటన ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ OTT విడుదలకు సిద్ధం అయింది. అక్టోబర్ 17న లయన్స్‌గేట్ ప్లే OTTలో రిలీజ్ అవుతోంది. మొత్తంగా, ‘సంతోష్’ కథా, సమాజ ప్రతిబింబం, అంతర్జాతీయ గుర్తింపు అన్ని కలిపి ప్రత్యేకంగా నిలిచిన ఈ చిత్రం అక్టోబర్ 17న OTT విడుదలతో కొత్త చర్చలకు నాంది పలుకనుంది.