టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ మంగళవారం ముంబైలో జరిగిన 2025 సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్‌లో పాల్గొన్నాడు. టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సంజు అందుకున్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌లోని సవాళ్లను, గాయాలను, జట్టుకు దూరంగా ఉన్నప్పుడు పడిన భాధను పంచుకున్నాడు. సంజు చేసిన సంవత్సరాల పోరాటం.. దేశం పట్ల అతడికి ఉన్న అపారమైన అంకితభావంకు నిదర్శనం. తన 10 ఏళ్ల కెరీర్‌లో కేవలం 40 మ్యాచ్‌లు మాత్రమే ఆడానని సంజు భావోద్వేగం చెందాడు.
‘భారత జెర్సీ ధరించినప్పుడు దేనికీ నో చెప్పడం కుదరదు. ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాను. దేశం కోసం నా వంతు కృషి చేయడం గర్వంగా అనిపిస్తుంది. నేను 9వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా లేదా ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్ చేయాల్సి వచ్చినా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడతాను. నేను ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. కానీ నేను భారత్ తరఫున 40 మ్యాచ్‌లు మాత్రమే ఆడాను. ఈ సంఖ్యలు చిన్నవిగా అనిపించవచ్చు కానీ.. నేను ఎన్నో సవాళ్లను అధిగమించాను, ఏ వ్యక్తిగా మారాను. అందుకు నేను గర్వపడుతున్నాను’ అని సంజు శాంసన్ చెప్పాడు. తనకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని చెప్పకనే చెప్పాడు. 2015లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన సంజు మొత్తం 65 మ్యాచ్‌లలో (16 వన్డేలు, 49 టీ20లు) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
Also Read: Rohit Sharma: పగలబడి నవ్వకున్న రోహిత్ శర్మ.. వీడీయో చూస్తే మీక్కూడా నవ్వాగదు!
గాయాలు, జట్టుకు దూరంగా ఉండటం, ఒత్తిడిలో ప్రదర్శన ఇవ్వకపోవడం తన కెరీర్‌లో భాగమని సంజు శాంసన్ తెలిపాడు. ‘క్రికెట్ ఆటలో ఒడిదుడుకులు ఉంటాయి. కొన్నిసార్లు గాయాల కారణంగా జట్టుకు దూరం అవుతాం, మరి కొన్నిసార్లు సరైన ప్రదర్శన ఇవ్వలేకపోవడంతో జట్టుకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటివి నా కెరీర్‌లో చాలా ఉన్నాయి. కానీ ఇవే మిమ్మల్ని మెరుగ్గా చేస్తాయి. నేర్చుకునే శక్తిని ఇస్తాయి. తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. భారత జెర్సీని ధరించడం కేవలం ఆడటానికి ఒక అవకాశం మాత్రమే కాదు.. ఒక పెద్ద బాధ్యత. ఏ పరిస్థితుల్లోనైనా దేశం కోసం ఆడడానికి సిద్ధంగా ఉండాలి. భారత్ తరఫున ఆడడం నాకు నాకు ఎల్లప్పుడూ గౌరవమే’ అని సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు.