ఐపీఎల్ 2026 కోసం మరికొద్ది రోజుల్లో ఆటగాళ్ల ట్రేడింగ్ ప్రక్రియ ఆరంభం కానుంది. ప్రస్తుతం సంజు శాంసన్, రవిచంద్రన్ అశ్విన్‌ల గురించే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)ను అశ్విన్, రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)ను శాంసన్ వదిలేసేందుకు సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి ‘కుట్టి స్టోరీస్’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఐపీఎల్ గురించి ఎలాంటి చర్చ జరగలేదు. తాజాగా సంజు శాంసన్ ట్రేడింగ్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్‌కేకు శాంసన్ వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువని పేర్కొన్నాడు.
ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘సీఎస్‌కే, ఆర్ఆర్ ట్రేడ్ వర్కౌట్ కాదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఒకవేళ సీఎస్‌కేకి సంజు శాంసన్‌ను ట్రేడింగ్ చేసి.. ఆర్ఆర్ ఇతర జట్లతోనూ ట్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తే తమకు కావాల్సిన ప్లేయర్స్ దక్కడం కష్టం. రాజస్తాన్‌కు రవి బిష్ణోయ్ లాంటి మంచి స్పిన్నర్ అవసరం. అందుకు లక్నోను అప్రోచ్ కావాలి. లక్నో ప్రాంచైజీ సంజును తీసుకొని బిష్ణోయ్‌ను ఇస్తే ఎల్‌ఎస్‌జీ పర్స్‌పై భారీగా ఎఫెక్ట్ పడుతుంది. సీఎస్‌కే ఇలాంటి ట్రేడింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపదు. రవీంద్ర జడేజా, శివమ్ దూబెను సీఎస్‌కే అస్సలు వదులుకోదు. ట్రేడింగ్ వలన రాజస్తాన్‌కు ప్రయోజనం ఉండకపోవచ్చు’ అని చెప్పాడు.
Also Read: Ram Chander Rao: డిబేట్‌కు నేను సిద్ధం.. దమ్ముంటే మీరు రండి!
రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో శాంసన్‌ను రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. మరోవైపు రవీంద్ర జడేజాను రూ.18 కోట్లకు, శివమ్ దూబెకు రూ.12 కోట్లు చెన్నై అట్టిపెట్టుకుంది. కీలక ప్లేయర్స్ అయిన జడేజా, దూబెలను సీఎస్‌కే వదులుకోవడం అసాధ్యమే. ఒకవేళ వదులుకున్నా.. ఈ ఇద్దరి కోసం ఆర్‌ఆర్ ఏకంగా 30 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2026 కోసం మినీ వేలం జరగనుంది. ఎప్పటిలానే నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి.