టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ అమ్మాయిగా మారాడు. 23 ఏళ్ల ఆర్యన్ బంగర్.. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకున్నాడు. ఆర్యన్ తన పేరును ‘అనయ బంగర్’గా మార్చుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు. తన 10 నెలల హార్మోన్ల పరివర్తన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో తాను అబ్బాయి నుండి అమ్మాయిగా ఎలా మారాడో చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అనయ బంగర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ‘శారీరకంగా బలాన్ని కోల్పోయా. కానీ అంతులేని సంతోషంతో ఉన్నా. నా శరీరం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నాలో అసంతృప్తి క్రమక్రమంగా తగ్గుతోంది. నేను చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇప్పుడు నేను వేసే ప్రతీ అడుగు నాకు బాగా నచ్చుతోంది’ అని అనయ పేర్కొంది. భారత దేశవాళీ టోర్నీల్లో ఆడిన అనయ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. సంజయ్ బంగర్‌కు ఇద్దరు కుమారులు కాగా.. పెద్దవాడు ఆర్యన్. సంజయ్ బంగర్ భారత్ తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు.
Also Read: Champions Trophy 2025: పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంపైనే పీసీబీ ఆశలు!
మరోవైపు అనయ రెండు పేజీల ఎక్స్ పోస్ట్‌లో తన బాధను వ్యక్తం చేసింది. దేశం కోసం క్రికెట్ ఆడలేకపోతున్నాననే బాధను వ్యక్తం చేసింది. ‘నా కల, ఆశయం, భవిష్యత్తు.. అంతా క్రికెటే. మా నాన్న భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. కోచ్‌గానూ పనిచేశారు. నాన్నను చూస్తూ పెరిగిన నేను.. ఆయన అడుగుజాడల్లో నడవాలని భావించాను. క్రికెట్లో నా నైపుణ్యాలను పెంచుకునేందుకు కృషి చేశా. కానీ ఆటను వదిలేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేసుకున్న తర్వాత ట్రాన్స్ వుమన్‌గా నాలో చాలా మార్పులు వచ్చాయి. నా శరీరం ఇప్పుడు మొత్తం పూర్తిగా మారిపోయింది. అథ్లెట్లకు ఉండాల్సిన పవర్ నాలో తగ్గింది. ట్రాన్స్ వుమన్‌కు కూడా క్రికెట్ ఆడే అవకాశాలు ఇవ్వాలి’ అని అనయ రాసుకొచ్చారు. ట్రాన్స్‌జెండర్లకు ఇంటర్నేషనల్ స్థాయిలో మహిళా క్రికెట్ ఆడే వీలు లేదని 2023లో ఐసీసీ నిర్ణయం తీసుకుంది.