Site icon NTV Telugu

Uday Kiran Organ Donation: ఆ యువకుడి ముందు చావు కూడా చిన్నబోయింది.. 8 మందికి పునర్జన్మనిచ్చిన 22 ఏళ్ల యువకుడు!

Organ Donation

Organ Donation

Uday Kiran Organ Donation: తమ బిడ్డ చేతికి అందివచ్చే వయసులో కన్నుమూస్తే.. పుట్టెడు దు:ఖంలో కూడా ఆ తల్లిదండ్రులు మానవత్వంతో ఆలోచించారు. తమ బిడ్డ చనిపోతూ మరో ఎనిమిది మంది రూపంలో బ్రతికి ఉండాలని నిర్ణయించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక యువకుడి అవయవాలను దానం చేసి, ఎనిమిది మందికి పునర్జన్మని ప్రసాదించి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళ్తే..

READ ALSO: Chanakya Niti: డబ్బు గురించి చాణక్యుడు చెప్పిన సంచలన నిజాలు.. ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి మీ వైపు కన్నెత్తి కూడా చూడదు!

అనుకోని ప్రమాదం.. అంతా చిన్నాభిన్నం
సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్ (22) ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే విధి ఆ యువకుడిపై కన్నెర్ర చేసింది. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌ నిజాంపేట బస్టాండ్‌లో బస్సు ఎక్కుతుండగా ఉదయ్ కిరణ్‌కు ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమైంది.

బ్రెయిన్ డెడ్ అని తేల్చిన వైద్యులు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారం రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నెల 11న ఉదయ్ కిరణ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. చేతికి అందిన కొడుకు ఇక తిరిగి రాడని తెలిస్తే.. కన్నపేగు దు:ఖం వర్ణించడం మాటలకు అంతుందా. అంతటి దు:ఖంలోనూ ఆ తల్లిదండ్రులు.. ఒక మహోన్నత నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ బిడ్డ తమకు దూరం అయిన అవయవదానం ద్వారా ఎనిమిది మందికి పునర్జన్మ ఇస్తాడని వైద్యుల సూచన మేరకు అవయవదానానికి అంగీకరించారు. ఉదయ్ కిరణ్ గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, కళ్లు వంటి అవయవాలను వైద్యులు సేకరించి అవసరమైన రోగులకు అమర్చారు. దీంతో ఎనిమిది మంది మృత్యువు అంచున ఉన్న రోగులకు ఉదయ్ కిరణ్ ద్వారా కొత్త జీవితం లభించింది.

అవయవదానం అనంతరం ఉదయ్ కిరణ్ పార్థివ దేహాన్ని సొంత గ్రామమైన కొత్లాపూర్‌కు తరలించారు కుటుంబ సభ్యులు. చేతికి అందివచ్చిన కొడుకు, శవంగా ఇంటికి వస్తే ఆ కుటుంబంతో పాటు గ్రామం మొత్తం కంటతడి పెట్టుకుంటూ ఉదయ్ అంత్యక్రియలు పూర్తి చేశారు. తమ గ్రామానికి చెందిన యువకుడు ఎనిమిది మంది ప్రాణాలు కాపాడాడని తెలిసి గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మరణంలోనూ మరో ఎనిమిది మందిని బ్రతికిస్తున్న ఉదయ్ కిరణ్ ఇప్పుడు ఆ జిల్లాలో రియల్ హీరోగా నిలిచాడు.

READ ALSO: PM Modi: మహిళా రిజర్వేషన్లపై ప్రధాని కీలక ప్రకటన.. జనాభా గణనతో పనిలేదు.. 2011 గణాంకాలతోనే అమలు!

Exit mobile version