Vaibhav Sooryavanshi-Sanath Jayasuriya: భారత టీమ్‌లోకి కొత్తగా వచ్చిన టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై శ్రీలంక మాజీ కెప్టెన్, 1996 వరల్డ్ కప్ హీరో సనత్ జయసూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉన్న ఆటగాడని, అతనిలో భారత క్రికెట్ భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తోందని కొనియాడారు. అయితే, అంతమాత్రాన అతడిని తొందరపడి వెంటనే ప్లేయింగ్ 11లోకి దించకూడదని సూచించారు. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌కు వైభవ్ భారత స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ, టీమ్ యాజమాన్యం సంజూ శామ్సన్, అభిషేక్ శర్మల రెగ్యులర్ ఓపెనింగ్ జోడీకే ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. కార్పొరేట్ వరల్డ్ కప్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన జయసూర్య, వైభవ్‌కు ఇంకా చాలా సమయం ఉందనడంలో సందేహం లేదన్నారు. అతనికి సరైన అవకాశాలు ఇస్తే తప్పకుండా రాణిస్తాడని, అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునే సత్తా అతనికి ఉందని నమ్మకం వ్యక్తం చేశారు. అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనేది తుది జట్టు అవసరాలపై ఆధారపడి ఉంటుందని, టీమ్ సెలక్షన్ లేదా బ్యాటింగ్ ఆర్డర్‌పై తాను కామెంట్ చేయలేనప్పటికీ అతడొక హైలీ టాలెంటెడ్ ప్లేయర్ అని ప్రశంసించారు. ఇదే క్రమంలో ప్రస్తుత ఓపెనర్లు అభిషేక్, సంజూ శామ్సన్‌లు కూడా తమ స్థానాలను నిలబెట్టుకోవాలంటే నిలకడగా రాణించాల్సిందేనని వ్యాఖ్యానించారు. భారత క్రికెట్‌లో పోటీ చాలా ఎక్కువగా ఉంటుందని, ఏ ఆటగాడైనా కాస్త తగ్గినా వారి స్థానాన్ని భర్తీ చేయడానికి ఎంతోమంది ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతీ క్రికెటర్ తమ ప్రాక్టీస్, ట్రైనింగ్‌లో చాలా కష్టపడతారని తెలిపారు. మూడు ఫార్మాట్లలోనూ (టెస్టులు, వన్డేలు, టీ20లు) టీమిండియా ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉన్నాయని 57 ఏళ్ల జయసూర్య కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో మూడింట్లోనూ రాణించడం తేలికైన విషయం కాదని, దేశం కోసం ఆడాలనే బలమైన కోరిక, ఆరాటం భారత్ ప్లేయర్లలో ఎక్కువగా ఉండటం వల్లే వారు ఈ స్థాయిలో మెరుస్తున్నారని అభిప్రాయపడ్డారు. మరోవైపు క్రికెట్‌లో కార్పొరేట్ రంగానికి ప్రాధాన్యత పెరుగుతోందని, అందుకే ఈ కార్పొరేట్ క్రికెట్ వరల్డ్ కప్ ఎంతగానో ఉపయోగపడుతుందని జయసూర్య స్పష్టం చేశారు. ఐపీఎల్ లేదా స్టేట్ లెవల్, క్లబ్ స్థాయిలో అవకాశాలు రాని అనేకమంది నైపుణ్యం కలిగిన ఆటగాళ్లకు ఇదొక గొప్ప వేదిక అని చెప్పారు.

