భారతదేశంలో అత్యంత వృద్ధ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత షఫికర్ రహ్మాన్ బర్క్ (93) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొరాదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
ప్రస్తుత పార్లమెంటులో (Parliament) అత్యంత వృద్ధ ఎంపీగా (Shafiqur rahman barq) ఉన్న ఆయన.. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌లో జులై 11, 1930న షఫికర్ రహ్మాన్ బర్క్ జన్మించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా సేవలందించారు. ప్రస్తుతం సంభల్ స్థానం నుంచి పార్లమెంటులో ఎంపీగా కొనసాగుతున్నారు. అంతకుముందు మొరాదాబాద్ ఎంపీగాను మూడుసార్లు పనిచేశారు. ఇక సంభల్ ఎంపీగా రెండోసారి గెలుపొందారు.
ఇక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ స్థానం నుంచే బర్క్‌ను బరిలో దించాలని సమాజ్‌వాదీ పార్టీ ఇటీవలే నిర్ణయించింది. కానీ ఆయన ప్రాణాలు కోల్పోయారు. బర్క్ మృతి పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంతాపం తెలియజేశారు.