Samagra Kutumba Survey: దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రస్తుతానికి 15 జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తయింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇకపోతే, ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా 27 రోజుల్లో 1,11,49,488 కుటుంబాల గణన పూర్తి చేశారు అధికారులు. వీటిలో ఇప్పటివరకు 79,63,637 కుటుంబాల డేటా ఎంట్రీ కూడా పూర్తయింది. దీంతో, దాదాపు 67.8 శాతం డేటా ఎంట్రీ జరిగింది.
Also Read: Pushpa 2: పుష్ప 2 నిలిపివేయాలంటూ పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు
రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో మంగళవారం నాటికి 15 జిల్లాల్లో వందకు వంద శాతం సర్వే పూర్తయింది. ములుగు, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, జనగాం, ఖమ్మం, నల్గొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాబాదు, పెద్దపల్లి, మెదక్, వనపర్తి, కుమరంభీం ఆసిఫాబాద్, భద్రాచలం కొత్తగూడెం జిల్లాలు వంద శాతం సర్వే పూర్తయిన జాబితాలో ఉన్నాయి. ఈ సర్వే బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని, రాష్ట్రంలో చేపట్టే కుల గణన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అన్ని వర్గాలు సర్వేలో పాలుపంచుకున్నాయి.