Sajjala Ramakrishna Reddy: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన గెస్ట్ హౌస్ ని ఏపీ గవర్నమెంట్ అటాచ్ చేసిన విషయం విదితమే.. క్రిమినల్ లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం ప్రాపర్టీని అటాచ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, నారాయణ తమ పదవులను దుర్వినియోగపరిచి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణలో భాగంగా చర్యలు చేపట్టారు.. కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా పొందారని చంద్రబాబుపై అభియోగాలు మోపారు.. చట్టాలను ఉల్లంఘించినట్టు విచారణలో తేలిందంటున్నారు.. అయితే, సీఐడీ అటాచ్‌మెంట్ పై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. నేను నిలబడి ఉన్న ఈ ప్రాంతం కూడా మాయా వేదికే.. అక్రమాలకు చిరునామా కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు.. ఆ అక్రమ కట్టడంలో చంద్రబాబు ఏ హోదాలో ఉంటున్నారో అర్థం కాదన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇంటి అలవెన్సు పొందుతున్నారు.. కానీ, ఎక్కడా అద్దెకు తీసుకున్నట్లు ఒప్పందాలు లేవన్నారు సజ్జల.. లింగమనేని రమేష్ ఆ ఇంటిని దేశభక్తితో ప్రభుత్వానికి ఇచ్చినట్లు కోర్టుకు చెప్పారన్న ఆయన.. మరి చంద్రబాబు అధికారం పోయిన తర్వాత కూడా అదే ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నారు? అని నిలదీశారు.. పేదల, ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని.. కపటత్వానికి చంద్రబాబు ప్రతినిధి అని ఆరోపించారు. ఒక వైపు ప్రజల కోసం నిలబడే వైసీపీ, మరోవైపు పెత్తందారీ స్వభావం ఉన్న చంద్రబాబు, జనసేన, వారి మీడియా ఉంది.. ఈ కుట్రల పట్ల మనం అందరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక, రాజకీయ ఆట నిబంధనలను మార్చిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు సజ్జల.. గడప గడపకు వెళుతున్నప్పుడు ప్రజల నుంచి మంచి అభిమానం వ్యక్తం అవుతోందన్నారు.. ప్రతిపక్షాలకు అర్హత లేదు.. తోడేళ్ల మందలా ఏకమై దాడి చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. మాయా మారిచ శక్తుల్లా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇది ఎక్కువ అవుతోందన్నారు. కోటి 60 లక్షల కుటుంబాలు సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందాయి.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయం అంటే ఎత్తులు, పొత్తులతో కాదు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేయాలని.. అమలు చేయలేకపోతే ధైర్యంగా ఒప్పుకోగలగాలని హితవు పలికారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.