Sajjala Ramakrishna Reddy: అంగళ్ళులో తనపైన హత్యాయత్నం జరిగిందని చంద్రబాబు ఆరోపణ చేస్తున్నారని, సీబీఐ విచారణకు సిద్ధం అంటున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం పై విమర్శలు చేయడం ద్వారా తాను తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పదలుచుకున్నారని ఆయన విమర్శించారు. అంగళ్ళులో ఏమి జరిగిందో ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు చేసిన నేరం ఎలాంటిదో మరోసారి చూడాలన్నారు. చంద్రబాబు సైగలు చేస్తూ తరమండి అని చెప్పడంతో టీడీపీ అరాచక శక్తులు వైసీపీ సానుభూతి పరులపై దాడి చేశారని.. చంద్రబాబు భాషా, రెచ్చగొట్టే విధానం వల్లే గొడవ జరిగిందన్నారు. చంద్రబాబుకు పోలీసులు అంటే చులకన అంటూ ఆయన మండిపడ్డారు. దాడి జరిగే పరిస్థితి ఉంటే నాయకుడు అనే వాడు అవుతాడా? రెచ్చగొడతారా అంటూ సజ్జల మండిపడ్డారు.
తాను కోరుకున్నది జరుగుతున్నదని చంద్రబాబు మొహంలో వికృత ఆనందం కనిపిస్తుందని ఆయన చెప్పారు. ప్రీ ప్లాన్డ్ గా అరాచక, ఉగ్రవాద ముఠాగా దాడులు చేశారని.. ఇలాంటి వాళ్ళు కార్యకర్తలా…. వాళ్ళకి నాయకుడని చెప్పుకోడానికి చంద్రబాబుకి సిగ్గుండాలన్నారు.
చంద్రబాబు దేనికి ఇదంతా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టులని బయలుదేరటం ఏంటి… చేసింది ఏంటన్నారు. తూ తూ మంత్రంగా రెండు చోట్ల కు వెళ్ళి సెల్ఫీలు దిగాడని సజ్జల విమర్శించారు. చాలా నిగ్రహంగా ఉన్నా పోలీసులనూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని చంద్రబాబుపై సజ్జల మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో ఏమీ చేయలేనని తనకు అర్థం అయ్యిందని.. అందుకే ఏదో ఒక అరాచకం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిరంజీవిపై సజ్జల రియాక్షన్
ముఖ్యమంత్రి జగన్ ఏ విషయంలోనూ వివక్షకు తావు లేకుండానే చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. పారదర్శక వ్యవస్థ పెట్టిన ముఖ్యమంత్రిని చిరంజీవి గతంలో చాలా బాగా చేస్తున్నారని చెప్పారని.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కావటం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. టికెట్ల విషయంలో ఇటు ప్రజలు, అటు సినీ పరిశ్రమ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించి కేంద్రం నుంచి రాష్ట్ర ప్రయోజనాలకు ప్రయత్నం చేస్తే మంచిదన్నారు. అప్పుడు ఆ క్రెడిట్ కూడా వాళ్ళే తీసుకోవచ్చని సజ్జల పేర్కొన్నారు. రాజకీయ వ్యాఖ్యలకు ప్రతిస్పందన ఉండకుండా ఎలా ఉంటుందన్నారు. చట్టం ప్రకారం ఏం చేయాలో అన్నీ జరుగుతాయన్నారు. దాడుల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గానే పరిగణిస్తుందని.. నేను సీనియర్‌ని, ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే చట్టంలో కుదరదన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు ఉంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.