Sajjala Ramakrishna Reddy: ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటూ జనాన్ని చంద్రబాబు భయపెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు సమయంలో అసెంబ్లీలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. 2019 జులైలో అసెంబ్లీలో టీడీపీ పయ్యావుల కేశవ్ మద్దతుగా మాట్లాడారన్నారు. ఈ బిల్లు వచ్చినప్పుడు అసెంబ్లీలో టీడీపీ సభ్యులు 13 మంది ఉన్నారన్నారు. ఈ బిల్లు సమయంలో కౌన్సిల్‌లో నారా లోకేష్ ఉన్నారన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిన తరవాత ప్రభుత్వమే ఆ ప్రాపర్టీకి గ్యారెంటీ అంటూ సజ్జల వెల్లడించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు కావాలంటే ముందు భూమి సర్వే పూర్తి కావాలన్నారు.
Read Also: CM YS Jagan: పేదల తలరాత మారాలంటే ఒక్కసారి ఆలోచించండి..
మోడీ ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ సిఫారసుతోనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిందన్నారు. చంద్రబాబు దివాళా తీశారని.. అందుకే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చెత్త అని మోడీ, అమిత్ షాతో చెప్పించాలని ఆయన సవాల్ విసిరారు. అప్పుడు ఎందుకు ఆమోదం తెలిపారు.. ఇప్పుడు అడ్డగోలుగా ప్రచారానికి చంద్రబాబు ఎందుకు దిగారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే మద్దతు ఇచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేస్తా అంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. రిజిస్ట్రేషన్‌లపై కూడా తప్పడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ వైజాగ్‌లో స్థలం కొన్నారు.. చంద్ర బాబు చెప్పే ప్రకారం అది ఆయన ఆస్తి కాదన్నారు. పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నెలలో ఆస్తి కొన్నారు.. మరి ఆ ఆస్తికి ఏం అయ్యిందంటూ ప్రశ్నించారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ-స్టాంప కలెక్షన్ 2016-2017 నుంచి మొదలు అయ్యిందని.. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్ర బాబు నాయుడు అని ఆయన తెలిపారు. ఈ-స్టాంపింగ్ విధానం 24 రాష్ట్రాల్లో కొనసాగుతుందన్నారు. ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వ్యవస్థల మీద నమ్మకం లేని ఉగ్రవాదుల చర్యలా చంద్ర బాబు తీరు ఉందని విమర్శించారు. చంద్ర బాబు ఇచ్చిన ఆరు హామీల అమలు చేయలేనని ఆయనకు తెలుసని.. అందుకే ప్రజల్లో అపోహలు భయాందోళనలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. భూ సమగ్ర సర్వే పూర్తి అయి… గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు లోకి వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.