NTV Telugu Site icon

Sajjala: బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు

Sajjjal

Sajjjal

బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వెంపర్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పొత్తు కోసం ఢిల్లీలో చంద్రబాబు పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిరాశ, నిస్పృహలో ఉన్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తు ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు కాంగ్రెస్‌ను కంట్రోల్‌లో ఉంచుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు పొత్తుల ప్రయత్నం చూస్తుంటూనే జగన్, వైసీపీ బలం ఏంటో అర్థమవుతుందన్నారు.

చంద్రబాబు డైరెక్షన్‌లో షర్మిల
చంద్రబాబు డైరెక్షన్‌లోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పని చేస్తున్నారని విమర్శించారు. అందరూ కలిసినా వైసీపీకి ఏమి నష్టం ఉండదని చెప్పుకొచ్చారు. పొత్తులు కుదుర్చుకున్న వాళ్లకు భావసారుప్యత ఉంటుందా? అని ప్రశ్నించారు. బీజేపీ బలం రాష్ట్రంలో ఏంటో అందరికీ తెలిసిందేనన్నారు. టీడీపీ అంతిమయాత్ర సాగుతుందని సజ్జల ధ్వజమెత్తారు.

20 ఏళ్ల క్రితమే దోపిడీ.
‘‘చంద్రబాబు 20 ఏళ్ల క్రితమే మహా దోపిడీ బయటపడింది. దోపిడీ, నిలువు దోపిడీకి చంద్రబాబు ఫేమస్. చంద్రబాబు నేరుగా అవినీతికి పాల్పడ్డారు. అవినీతిలో విశ్వరూపం చూపించారు. 2003 మార్చిలో IMG భారత్ అనే సంస్థ పుట్టిన నాలుగు రోజులకే బాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ కంపెనీకి తల తోక లేదు. ఒప్పందం ప్రకారం 850 ఎకరాల ల్యాండ్ … స్టేడియంల మీద హక్కు, ఖర్చులు, కార్యాలయం ఏర్పాటుకు జూబ్లీ హిల్స్ లో 5 వేల గజాల స్థలం ఇచ్చారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండి ఆ సంస్థకు 400 ఎకరాలు కట్టబెట్టారు.’’ అని సజ్జల వివరించారు.

‘‘2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో స్టార్ట్ అప్ ఏరియా అని 17 వందల ఎకరాలు కేటాయించారు. ఆ పక్కనే పరిపాలనా ప్రధాన కేంద్రాలు ఏర్పాటుకు ఆలోచన చేశారు. లాండ్ ఫూలింగ్ పేరుతో 30 వేల మంది రైతుల ఉసురు పోసుకున్నారు. రాజధాని పేరుతో అమరావతి భూములతో లక్ష కోట్లు దోచుకునే ప్రయత్నం చేశారు. సీమెన్స్ పేరుతో చంద్రబాబు స్కిల్ స్కాం చేసి జైలుకు వెళ్లారు.’’ అని సజ్జల పేర్కొన్నారు.