Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..

Sai Pallavi

Sai Pallavi

Sai Pallavi Saree Look: ‘రామాయణ’ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో సాయి పల్లివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన సింపుల్, పద్ధతైన రూపంతో అందరి మనసులను గెలుచుకుంది. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రామాయణ’ మొదటి భాగం ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

దీపావళికి సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం అక్టోబర్ 15వ తేదీన బెంగళూరులో అంతర్జాతీయ ట్రైలర్ లాంచ్ వేడుకతో ప్రచార కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించింది. ఈ వేడుకలో దర్శకుడు నితీశ్ తివారీ, సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్‌తో పాటు రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్, యష్ తదితరులు పాల్గొన్నారు. ఈ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎప్పుడూ తన సహజసిద్ధమైన అందంతో ఆకట్టుకునే సాయి పల్లవి మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ఇంగ్లీష్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సాయి పల్లవి ఎప్పటిలాగే అత్యంత సాదాసీదాగా కనిపించి అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. ఈ వేడుకలో ఆమె లేత గులాబీ రంగు సిల్క్ చీరలో అచ్చం రాజకుమారిలా మెరిసిపోయింది. ఈ గులాబీ రంగు టిష్యూ సిల్క్ చీరపై వెండి రంగు జర్దోజీ ఎంబ్రాయిడరీ, అందమైన మోటిఫ్స్, జరీ పనితనం చీరకు ప్రత్యేక అందాన్ని తెచ్చాయి. చీర అంచులపై ఉన్న ఆకర్షణీయమైన డిజైన్ ఆమె రూపానికి ఒక రాచరికపు శైలిని అందించింది. ఈ చీరకు సరిపోయేలా షార్ట్ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్ ధరించి ఎంతో హుందాగా కనిపించింది. సహజమైన సౌందర్యానికి మారుపేరైన సాయి పల్లవి ఈ ఈవెంట్‌లో చాలా తక్కువ అలంకరణతో కనిపించింది. చెవులకు బంగారు రంగు గుండ్రటి రింగులు, ఒక చేతికి గాజులు, కడా, మరో చేతిలో చిన్న చైన్ ధరించింది. తన సహజమైన కురులను సాఫ్ట్ వేవ్స్‌తో హాఫ్ ఓపెన్ హెయిర్‌స్టైల్‌లో ఉంచింది. ఈ వేడుకలో ఆమె తన సహనటులందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించిన తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.