ఈషా పౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఢిల్లీ అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవలే ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. సర్జరీ తర్వాత ఆయన వేగంగా కోలుకున్నారు. దీంతో వైద్యులు బుధవారం డిశ్చార్జ్ చేశారు.
ఇటీవల ఆయన తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. అనంతరం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. అనంతరం బ్రెయిన్‌లో ప్రమాదకర స్థితి ఉండడంతో కొన్ని గంటల్లోనే ఆయన మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స చేశారు. సద్గురు పూర్తిగా కోలుకున్నారని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి తెలిపారు. సద్గురు వేగంగా కోలుకున్నారని.. ఆయన అభిమానులకు ఇది శుభవార్తేనని చెప్పారు.
ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు సద్గురు ఢిల్లీ వెళ్లారు. అయితే తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంటే మార్చి 17న అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం వైద్యులు ఆయనకు సిటీ స్కాన్ చేశారు. తక్షణమే సర్జరీ చేయాలని సూచించగానే కొన్ని గంటల్లోనే శస్త్రచికిత్స నిర్వహించారు. డాక్టర్ వినిత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీలతో కూడిన వైద్యుల బృందం విజయవంతంగా సర్జరీ చేశారు.
ఇక ప్రధాని మోడీ.. సద్గురుకు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా సద్గురుతో మాట్లాడి.. మంచి ఆరోగ్యంతో పాటు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించారు.