NTV Telugu Site icon

SA vs IND: పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. మూడో టీ20 భారత్‌దే!

Sa Vs Ind 3rd T20i

Sa Vs Ind 3rd T20i

నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్‌ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. 220 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 208 పరుగులు చేయడంతో టీమిండియా 11 పరుగుల తేడాతో నెగ్గింది. ఛేదనలో హెన్రిచ్‌ క్లాసెన్‌ (41; 22 బంతుల్లో 1×4, 4×6), మార్కో యాన్సెన్‌ (54; 17 బంతుల్లో 4×4, 5×6) సంచలన బ్యాటింగ్‌తో కంగారెత్తించినా.. చివరికి భారతే పైచేయి సాధించింది. ఈ విజయంతో సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి టీ20 శుక్రవారం జరుగుతుంది.

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజూ శాంసన్ డకౌట్ అయినా.. అభిషేక్‌ శర్మ (50; 25 బంతుల్లో 3×4, 5×6), తిలక్‌ వర్మ (107 నాటౌట్‌; 56 బంతుల్లో 8×4, 7×6)ల మెరుపులతో భారత్ స్కోర్ పరుగులు పెట్టింది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందొచ్చిన తిలక్‌.. దక్షిణాఫ్రికా బ్యాటర్లపై దాడి చేశాడు. దాంతో పవర్‌ ప్లే ముగిసేసరికే భారత్‌ 70/1తో నిలిచింది. భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న భారత్‌కు షాక్ తగిలింది. అభిషేక్‌తో పాటు సూర్యకుమార్ (1) వరుస ఓవర్లలో నిష్క్రమించగా.. హార్దిక్‌ పాండ్యా (18) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. రమణ్‌దీప్‌ (15; 6 బంతుల్లో 1×4, 1×6) అండతో తిలక్‌ రేచిపోయి సెంచరీ చేశాడు.

ఛేదనలో దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే దక్కింది. రికిల్‌టన్‌ (20), హెండ్రిక్స్‌ (21) వేగంగా ఆడినా.. త్వరగా అవుట్ అయ్యారు. స్టబ్స్‌ (12), మార్‌క్రమ్‌ (29)ని భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. దాంతో 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 4 వికెట్లను 84 రన్స్ చేసింది. ఈ సమయంలో క్లాసెన్‌ సిక్స్‌లతో చెలరేగిపోయాడు. దాంతో 15 ఓవర్లకు స్కోరు 134/4గా నిలిచింది. చివరి 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 86 పరుగులు చేయాల్సి ఉన్నా క్లాసెన్‌ దూకుడు భారత్‌ను కలవరపెట్టింది. 19వ ఓవర్లో హార్దిక్ 30 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికాకు 25 పరుగులు అవసరం కాగా.. ఆర్ష్‌దీప్‌ చక్కగా బౌలింగ్‌ చేశాడు.