NTV Telugu Site icon

Plane Lands on Frozen River: రన్‌వే అనుకుని నదిపై విమానం ల్యాండింగ్‌.. ప్రయాణికులు సురక్షితం

Plane Lands On Frozen River

Plane Lands On Frozen River

Plane Lands on Frozen River: శీతాకాలం కావడంతో రష్యాలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలో ఆ దేశంలో అత్యధిక ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. చలితో అక్కడి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేవు. కొన్ని ప్రాంతాల్లో నదులు కూడా గడ్డకట్టుకుపోయి అక్కడ నది ఉందో లేదో కూడా అర్థం కానీ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఓ నదిపై విమానం ల్యాండ్‌ కూడా అయ్యింది. రష్యాలోని యకుటిమా అనే ప్రాంతంలోని జిర్యాంక సమీపంలో కొలిమా నది పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. ఈ నదిని ఆనుకునే ఓ ఎయిర్‌పోర్టు ఉంది. ఆ ఎయిర్‌పోర్టులో దిగాల్సిన ఓ విమానం పొరపాటున గడ్డకట్టిన నదిపై ల్యాండ్‌ అయింది.

Read Also: Karnataka: స్కూల్‌ విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం.. నెలలో మూడో ఘటన

పోలార్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం గురువారం జిర్యాంక విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే ఈ ఎయిర్‌పోర్టులోని రన్‌వేపై మంచుతో పేరుకుపోయింది. పక్కనే ఉన్న నది కూడా గడ్డకట్టి ఉండడంతో పైలట్‌కు ఏమీ అర్థం కాలేదు. గందరగోళానికి గురైన పైలట్‌ విమానాన్ని నదిపై ల్యాండ్‌ చేశాడు. ల్యాండింగ్‌ సమయంలో ఆ విమానంలో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రయాణికులను సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. విమానంలోని ప్రయాణికులకు ఏ ప్రమాదం జరగలేదు. పైలట్‌ తప్పిదం కారణంగానే విమానం నదిపై ల్యాండ్‌ అయిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.