నోబెల్ ప్రైజ్.. ప్రపంచంలోనే అత్యంత గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెట్టే బహుమతి. వివిధ రంగాల్లో ఉద్దండులకు మాత్రమే ఈ అవార్డును ఇస్తారు. అలాంటిది ఓ రష్యా జర్నలిస్టు ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పిల్లలకు ప్రయోజనం చేకూర్చడానికి రష్యా జర్నలిస్టు దిమిత్రి మురతోవ్ నోబెల్ శాంతి బహుమతిని సోమవారం వేలం వేశారు. ఈ వేలంలో నోబెల్ శాంతి బహుమతి సుమారు 800 కోట్ల(103.5మిలియన్ డాలర్లు)కు అమ్ముడుపోయింది. మురాతోవ్ 2021లో ఫిలిప్పీన్స్‌కు చెందిన జర్నలిస్ట్ మరియా రెస్సాతో కలిసి బహుమతిని గెలుచుకున్నారు. గతంలోని నోబెల్ వేలం రికార్డులు ఈ వేలంతో బద్దలయ్యాయి. 2014లో జేమ్స్ వాట్సన్ తన నోబెల్ బహుమతిని విక్రయించగా.. అప్పట్లో అత్యధికంగా 4.76డాలర్లు వచ్చాయి.
రష్యాలో దిమిత్రి మురతోవ్ స్వతంత్ర పత్రిక నొవాయా గెజిటాను స్థాపించారు. ఆ పత్రికను మార్చిలో మూసేశారు. ఆ పత్రికకు ఎడిటర్ ఇన్ చీఫ్‌గా ఆయన పనిచేశారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశం లోపల, వెలుపల అతని వ్యూహాలపై విమర్శలు గుప్పించిన ఏకైక ప్రధాన వార్తాపత్రిక ఇది. ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో రష్యా తమ దేశంలోని పాత్రికేయులపై కొరడా ఝులిపించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లో చిన్నారుల సంక్షేమం కోసం ఆయన బహుమతిని వేలం వేయాలని నిర్ణయించారు. 5లక్షల డాలర్ల డబ్బును కూడా ఆయన ఛారిటీకి ఇచ్చేశారు. వేలంలో వచ్చిన సొమ్ము నేరుగా యూనిసెఫ్ అకౌంట్‌లోకి వెళ్తుందని.. ఆ సంస్థ పిల్లల భవిష్యత్ కోసం ఖర్చు చేస్తుందని మురతోవ్ అన్నారు.